బాలీవుడ్ వర్సెస్ సౌత్ సోషల్ మీడియా సృష్టే

Thu May 12 2022 22:00:01 GMT+0530 (IST)

Bollywood Vs South In Social Media

గత కొంత కాలంగా టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాలు బాలీవుడ్ లో సత్తాని చాటుతున్నాయి. వందల కోట్ల మేర వసూళ్లని రాబడుతూ హిందీ చిత్రాలనే వెనక్కి నెట్టి అక్కడ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అనే నినాదం సోషల్ మీడియాలో మొదలైంది. అంతే కాకుండా ఇటీవల ఇక పై హిందీ భాష జాతీయ భాష కాదంటూ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు అజయ్ దేవ్ గన్ కు ఆయనకు మధ్య తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ తరువాత బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తాను దక్షిణాది చిత్రాల్లో అసలు నటించనని చెప్పడం కూడా మరింత వివాదానికి దారి తీసింది.అజజ్ఞ్ దేవ్ గన్ ల మధ్య జరిగిన భాషా సంబంధిత ట్విట్టర్ వార్ మర్చిపోకముందే తాజాగా మహేష్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అడివి శేష్ నటించిన `మేజర్` మూవీ ట్రైలర్ రిలీజ్ ఆకర్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ ఓ పాత్రికేయుడు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పడని అడిగిన ప్రశ్నకు మహేష్ `బాలీవుడ్ తనని భరించలేదని చెప్పిన తీరు ఇప్పడు హాట్ చర్చకు దారితీసింది. దీనిపై బాలీవుడ్ నిర్మాతలు బోనీ కపూర్ మహేష్ బట్ సోదరుడు ముఖేష్ భట్ భిన్నంగా స్పందించారు.

అది తన ఇష్టమని బోనీ కపూర్ వ్యాఖ్యానిస్తే ముఖేష్ భట్ మాత్రం కాస్త వ్యగ్యంగా మహేష్ పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ కంటెంట్ పై దృష్టిపెట్టాలని ఇండైరెక్ట్ గా చురకలంటించారు. బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అన్నది సోషల్ మీడియా సృష్టేనని తాను భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అనేది సోషల్ మీడియా సృష్టే అనుకుంటున్నా. మనమంతా భారతీయులం. ఏ ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే..ఓటీటీలో కేవలం కంటెంట్ కే పెద్ద పీట వేస్తున్నారు. మంచి కంటెంట్ వుంటే ప్రేక్షకులు అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.. ఆదరిస్తున్నారు. ఎలాంటి సినిమా చూడాలి.. ఎలాంటిది చూడొద్దు అన్నది వాళ్లిష్టం. ఇప్పుడున్న రోజుల్లో మనం ఆడియన్స్ ని మర్చిపోయి సినిమాలు చేస్తున్నామనిపిస్తోంది అంటూ ఇండైరెక్ట్ గా బాలీవుడ్ పై సెటైర్ వేశారు.

మనం ప్రేక్షకులకు మంచి కంటెంట్ ని ఇవ్వలేకపోతున్నామని భావిస్తున్నాను. కాబట్టి ఇకపై కంటెంట్ పై మనం ఎక్కువగా వర్క్ చేయాల్సి వుంటుంది. నేను దక్షిణాది నుంచి వచ్చాను. కానీ నా కర్మభూమి మాత్రం ముంబై. ఇరు ప్రాంతాల వాళ్లు నన్ను అభిమానిస్తున్నారు` అని వ్యాఖ్యానించారు సునీల్ శెట్టి. ఆయన మాటల్లో ఎక్కువగా దక్షిణాదిని తప్పుపట్టినట్టుగా కాకుండా బాలీవుడ్ ప్రస్తుతం సినిమాల విషయంలో అనుసరిస్తున్న తీరుని తప్పుపట్టినట్టుగా వుండటం గమనార్హం.