Begin typing your search above and press return to search.

థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్మేశాక OTT రిలీజ్?

By:  Tupaki Desk   |   5 July 2020 5:30 PM GMT
థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్మేశాక OTT రిలీజ్?
X
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి 13 నుండి సినీ పరిశ్రమలు స్థంభించిపోయాయి. నాలుగు నెల‌లుగా థియేట‌ర్ వినోదం క‌రువైంది. థియేట‌ర్ల‌కు వెళ్లే వీలు లేక‌పోవ‌డంతో జ‌నం టెలివిజన్ ఛానెల్స్ స‌హా ఓటీటీ వేదిక‌ల‌పై ఆధార‌ప‌డ్డారు. సినిమా హాల్స్ మూత వేయ‌డంతో ఓటీటీ వేదిక‌ల‌కు బిగ్ బూస్ట్ అందింది.

మార్చి 13 త‌ర్వాత‌ ముంబై స‌హా అన్ని మెట్రో న‌గ‌రాల్లో మ‌హ‌మ్మారీ విజృంభ‌ణ అంతకంత‌కు రెట్టింపైంది. అప్ప‌టినుంచి అదే సందిగ్ధ‌త‌. ఇప్పుడు అంత‌కుమించిన వైర‌స్ ముప్పుతో సందిగ్ధ‌త ప‌దింత‌ల‌వుతోంది. దీంతో ఇన్నాళ్లు వెయిటింగులో ఉన్న వాళ్లంతా ఇక థియేట్రిక‌ల్ రిలీజ్ ఆశ‌ల్ని వ‌దులుకుని ఓటీటీ వేదిక‌ల‌పై కి వ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నారు. వీటిలో అప్ప‌టికే థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మేసిన సినిమాలు ఉండ‌డం ఓకింత ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ముఖ్యంగా హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ ప‌రిస్థితి మ‌రింత ఉధృతం కానుందిట‌.

ఇర్ఫాన్ ఖాన్ న‌టించిన `అంగ్రేజీ మీడియం` మార్చి 13న థియేట్రిక‌ల్ రిలీజైంది. దాదాపు 35 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కేవ‌లం 14 కోట్లు వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత వైర‌స్ విజృంభ‌ణ‌తో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యారు. ఇర్ఫాన్ మ‌ర‌ణానంత‌రం ఈ నటుడికి భారీ సానుభూతి ఈ మూవీ వ్యూవ‌ర్ షిప్ ని ప్ర‌భావితం చేస్తుంద‌నేది ఆలోచ‌న‌. దీంతో అంగ్రేజీ మీడియం థియేట్రిక‌ల్ రిలీజ్ అనంత‌రం నెల లోపే ఓటీటీ వేదిక‌పై రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది. లాక్ డౌన్ ఎక్కువసేపు ఉంటుందని భావించిన మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌స్టార్ ప్లాట్ ‌ఫామ్ లో రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత ఇత‌ర మేక‌ర్స్ కూడా త‌మ సినిమాల‌ను ఓటీటీ వేదిక‌ల‌పై రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపించారు.

ప్ర‌స్తుత స‌న్నివేశంలో పూర్తిగా ఆశ‌లు వ‌దిలేసుకున్న చాలామంది హిందీ నిర్మాత‌లు.. సినిమా హాళ్ళు తిరిగి తెరవడం కోసం వేచి ఉండడం లేదు. రైజింగ్ సన్ ఫిల్మ్స్ ఇప్ప‌టికే `గులాబో సీతాబో` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్రీమియర్ విడుదల అమెజాన్ ప్రైమ్ ‌లో జరిగింది. అయితే అప్ప‌టికే ఈ మూవీ థియేటర్ హక్కులు అమ్ముడవ్వ‌డం బిగ్ ట్విస్ట్‌. అయితే ముందే హ‌క్కులు అమ్మేస్తే ఏం చేయాలి? అంటే పంపిణీదారు న‌ష్ట‌పోకుండా త‌గిన ఏర్పాట్ల‌ను మేక‌ర్స్ చేయాల్సి ఉంటుంద‌న్న చ‌ర్చా సాగుతోంది. మునుముందు మ‌రిన్ని హిందీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటి విష‌యంలో ఎలాంటి బిజినెస్ ప్రాతిప‌దిక‌లు అమ‌ల‌వుతాయి? అన్న‌ది ఆస‌క్తిక‌రం.