Begin typing your search above and press return to search.

హైకోర్టులో బాలీవుడ్ ప్రముఖులు దావా వేయడంపై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్...!

By:  Tupaki Desk   |   13 Oct 2020 8:30 AM GMT
హైకోర్టులో బాలీవుడ్ ప్రముఖులు దావా వేయడంపై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్...!
X
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి అనేక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసు.. డ్రగ్స్ కేసు.. లైంగిక వేదింపులు మొదలైన వాటి గురించి లైవ్ డిబేట్లు పెట్టి కథనాలు ప్రసారం చేశాడు. సుశాంత్ కేసులో ఓవైపు సీబీఐ - ఈడీ - ఎన్సీబీ విచారణ చేస్తుంటే రిపబ్లిక్ టీవీ మరియు అర్నబ్ గోస్వామి ఈ కేసులో సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ డైలీ ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరైన హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రొడ్యూసర్ల గురించి ఎప్పటికప్పుడు డిబేట్స్ పెడుతూ 'బాలీవుడ్ లో పేరుకుపోయిన మురికిని కడిగేయాలి' అని కామెంట్స్ చేసాడు. కరణ్ జోహర్ - సల్మాన్ ఖాన్ - అలియాభట్ - మహేష్ భట్ - ఆదిత్య చోప్రా వంటి సినీ ప్రముఖుల గురించి లైవ్ డిబేట్లు పెట్టారు. అయితే ఇటీవల ఎయిమ్స్ వైద్య బృందం సుశాంత్ ఆత్మహత్య చేసుకునే చనిపోయాడని నివేదిక ఇవ్వడం.. రియా చక్రవర్తికి బెయిల్ రావడం తదితర పరిణామాలతో బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు రెండు మీడియా సంస్థలపై ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలు, అసత్య కథనాలు రిపబ్లిక్ టీవీ మరియు టైమ్స్ నౌ సంస్థలు ప్రసారం చేశాయంటూ ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్‌ కు చెందిన 38 సంస్థలు మరియు 4 ప్రధాన అసోసియేషన్స్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇందులో అమీర్ ఖాన్ - షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ - అజయ్ దేవగణ్ - కరణ్ జోహర్ - ఆదిత్య చోప్రాకు చెందిన పలు సంస్థలున్నాయి. రిపబ్లిక్ టీవీ మరియు ఆ ఛానెల్ కు చెందిన అర్నాబ్ గోస్వామి - ప్రదీప్ భండారి లపై ఈ దావా వేయబడింది. అలానే టైమ్స్ నౌ మరియు ఆ ఛానెల్ కు చెందిన రాహుల్ శివశంకర్ - నవికా కుమార్ ల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందిస్తూ బాలీవుడ్ పై సెటైర్ వేశాడు.

బాలీవుడ్ ప్రముఖులు అర్నబ్ గోస్వామి తీరుపై లేట్ గా స్పందించారంటూ ''బాలీవుడ్ రియాక్షన్ చాలా ఆలస్యమైంది.. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ డిల్లీ హైకోర్టు ముందుకు వెళ్లి స్కూల్ పిల్లల్లా టీచర్ వద్ద 'టీచర్ టీచర్ అర్నబ్ మమ్మల్ని తిడుతున్నాడు' అంటూ చెప్పినట్టుంది'' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ మొదటి నుంచి కూడా అర్నబ్ గోస్వామి తీరుపై మండి పడుతూనే ఉన్నాడు. అర్నబ్ రిపోర్టింగ్ పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ.. చివరకు అర్నబ్‌ పై సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ''న్యూస్ ప్రాస్టిట్యూట్'' అనే సినిమా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు అర్నబ్‌ పై బాలీవుడ్ చాలా లేటుగా స్పందించడం.. ఫిర్యాదు చేయడంపై ఆర్జీవీ సెటైర్ వేశాడు.