Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు : హీరోయిన్లను ఎన్‌ సీబీ మళ్లీ పిలిచే అవకాశం ఉందా...?

By:  Tupaki Desk   |   29 Sep 2020 10:50 AM GMT
డ్రగ్స్ కేసు : హీరోయిన్లను ఎన్‌ సీబీ మళ్లీ పిలిచే అవకాశం ఉందా...?
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. కొందరు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారిస్తోంది. ఈ క్రమంలో ఎన్‌సీబీ బాలీవుడ్ డ్రగ్స్‌ మాఫియాకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇక డ్రగ్స్ అభియోగాలపై ఇటీవల స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే - శ్రద్ధా కపూర్ - రకుల్‌ ప్రీత్‌ సింగ్ - సారా అలీఖాన్‌ లు ఎన్‌సీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ - టాలెంట్ మేనేజర్ జయ సాహా లను కూడా ప్రశ్నించారు. అయితే ఈ విచారణలో వీరందరూ ఒకే విధమైన సమాధానాలు చెప్పడంపై ఎన్సీబీ బృందాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయట. ముందుగానే దీనిపై ఫుల్ గా ప్రిపేర్ అయి వచ్చారేమో.. అందుకే హీరోయిన్లు చెప్పిన విషయాలు దాదాపు ఒకేలా ఉన్నాయని అంటున్నారట. అంతేకాకుండా వీరందరూ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడిస్తూ.. 'హ్యాష్‌' అనేది మత్తు పదార్థం కాదని చెప్పడంపై కూడా ఎన్సీబీ అధికారులు ఆలోచిస్తున్నారట. అందుకే వీరిని మరోసారి ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదని నేషనల్ మీడియా చెప్తోంది.

ఇదిలా ఉండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిజి రాకేశ్ అస్తానా డ్రగ్స్ కేసుపై రివ్యూ చేయడానికి ఆదివారం నాడు ఢిల్లీ నుంచి ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి వరకు జరిగిన మీటింగ్ లో ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా మరియు సమీర్ వాంఖడే - అశోక్‌ జైన్‌ సహా ఎన్సీబీ ఉన్నతాధికారులు అందరూ పాల్గొన్నారని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు జరిపిన విచారణ ప్రకారం రూపొందించిన సమగ్ర నివేదికపై ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా డ్రగ్‌ మాఫియా మూలాలను వెలికితీసి ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి డిజి అస్తానా ఆరు నెలల కాలపరిమితిని ఇచ్చారని.. మరింత లోతుగా దర్యాప్తు జరిపి మాదక ద్రవ్యాల అణిచివేతకు అస్తానా నుంచి ఎన్‌సిబి బృందాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మీడియా వర్గాలు తెలిపాయి.