Begin typing your search above and press return to search.

ఈవారం కూడా నిరాశే.. బాలీవుడ్ కు అందని ద్రాక్షగా మారిన విజయం..!

By:  Tupaki Desk   |   14 May 2022 11:30 AM GMT
ఈవారం కూడా నిరాశే.. బాలీవుడ్ కు అందని ద్రాక్షగా మారిన విజయం..!
X
బాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఏ హిందీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. స్టార్ హీరోలు చేసిన సినిమాలకు కూడా కనీస ఓపెనింగ్స్ ఉండటం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు భారతీయ సినిమాకు పెద్దన్న అన్నట్లుగా బాలీవుడ్ జనాలు వ్యవహరించేవారు. దక్షిణాది మేకర్స్ ఎంత మంచి మూవీ చేసినా.. ప్రాంతీయ చిత్రంగా చిన్నచూపు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

సౌత్ సినిమాలు నార్త్ సర్క్యూట్స్ లో దుమ్ము దులుపుతున్నాయి. మన చిత్రాల దెబ్బకు బాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద కొలుకోలేపోతున్నాయి. KGF-2 మరియు RRR వంటి డబ్బింగ్ చిత్రాలు హిందీ మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఉండటంతో.. స్ట్రెయిట్ హిందీ రిలీజులు ఏమాత్రం నిలబడలేకపోతున్నాయి.

ఈ ఏడాది రిలీజ్ అయిన 'ఎటాక్' 'బచ్చన్ పాండే' 'జెర్సీ' 'రన్ వే 34' మరియు 'హీరోపంతి 2' వంటి హిందీ సినిమాలు ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక ప్లాప్స్ గా మిగిలాయి. ఈ క్రమంలో నిన్న శుక్రవారం ''జయేష్ భాయ్ జోర్దార్'' సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి బాక్సాఫీస్ బరిలో దిగింది.

బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ - 'అర్జున్ రెడ్డి' ఫేం షాలిని పాండే జంటగా నటించిన చిత్రం ''జయేశ్ భాయ్ జోర్దార్''. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పించిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ నిర్మించారు. దివ్యాంగ్ ఠాకూర్ దర్శకత్వం వహించారు.

అయితే ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన 'జయేశ్ భాయ్' సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా 2250 కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం.. ఓపెనింగ్ డే నాడు రూ. 5 కోట్ల కంటే తక్కువ వసూళ్ళు రాబట్టింది. ఇది పేలవమైన ప్రదర్శన అనే చెప్పాలి.

బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ ఈ చిత్రానికి 1 లేదా 1.5 స్టార్స్ రేటింగ్స్ మాత్రమే ఇవ్వడం.. తొలి రోజు మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోకపోవడం చూస్తుంటే.. రణ్వీర్ సింగ్ సినిమా ఈ వీకెండ్ లో తిరిగి పుంజుకునే అవకాశమే లేదనిపిస్తోంది. ఇది ఇప్పటికే 420 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన 'కేజీయఫ్ 2' చిత్రానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.

ఏదేమైనా హిందీ చిత్ర పరిశ్రమ సూపర్ హిట్ ని అందించడానికి కొన్ని నెలలుగా తీవ్రంగా కష్టపడుతోంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మించిన 'ది కశ్మీర్ ఫైల్స్' తప్ప మరో చిత్రం సక్సెస్ అవ్వకపోవడంతో బాంబే ఫిల్మ్ మేకర్స్ అంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ 'ధక్కడ్' మరియు కార్తీక్ ఆర్యన్ యొక్క 'భూల్ భూలయ్య'.. అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' - అజయ్ దేవగన్ 'మైదాన్' - అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' వంటి సినిమా విడుదల కోసం బాలీవుడ్ వేచి చూస్తోంది. మరి ఇందులో ఏవేవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయో చూడాలి.