Begin typing your search above and press return to search.

RFC పేలుడు వెన‌క అస‌లు క‌థ ఇదీ

By:  Tupaki Desk   |   11 Feb 2020 7:15 AM GMT
RFC పేలుడు వెన‌క అస‌లు క‌థ ఇదీ
X
ఇటీవ‌ల‌ రామోజీ ఫిల్మ్ సిటీలో అనుమానాస్పద పేలుడు సంచ‌ల‌నం అయిన సంగ‌తి తెలిసిందే. తీవ్రంగా కాలిన గాయాలతో రావు సాహెబ్ అనే వ్యక్తి కోటపేట సాయి సంజీవని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బాధితుడైన‌ రావు వయసు 48. రావు సాహెబ్ మహారాష్ట్ర కు చెందిన కూలీ. సినీసెట్ వర్కర్. రామోజీ ఫిల్మ్ సిటీలో పేలుడుకి అత‌డికి ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌ది ఆరా తీసిన పోలీసుల‌కు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. ఈ పేలుడు గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిందని అబ్దుల్లాపూర్ ఇన్ స్పెక్టర్ ఎస్. దేవేందర్ వెల్లడించారు.

నిత్యం షూటింగుల‌తో బిజీగా ఉండే రామోజీ ఫిలింసిటీ ఆక‌స్మిక పేలుడుతో ఉలిక్కిప‌డింది. ``ఫిల్మ్ సిటీలో ఖాళీ పెయింట్ బాక్సుల నుండి గ్యాస్ లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించింది. ఘటనలో రావు గాయపడ‌గా స‌మీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కు చెందిన రావు సాహెబ్ అనే కూలీగా గుర్తించామ‌``ని పోలీసులు తెలిపారు.

బిఎస్ఎఫ్ బ్లాక్ 7-8 అంతస్తుల సమీపంలో పేలుడు సంభ‌వించింది. రావు సాహెబ్ కొన్ని పెయింట్ బాక్సులను కదిలిస్తున్నప్పుడు.. ఒక పెట్టె నుంచి గ్యాస్ లీకై సిలెండ‌ర్ పేలింది. ఆ శ‌బ్ధానికి అక్కడ పనిచేస్తున్న ఇతర కార్మికులు బిత్త‌ర‌పోయి త‌మ‌ను తాము కాపాడుకునేందుకు కంగారుగా అటూ ఇటూ పరుగెత్తారు. దాదాపు 1666 ఎకరాలలో విస్తరించి ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో. బాహుబలి సిరీస్ ఇక్క‌డే తెర‌కెక్కింది. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా అన్ని భాష‌ల చిత్రాల‌ని ఇక్క‌డ తెర‌కెక్కిస్తున్నారు.