రియా కోసం వెదుకుతున్నాం : బీహార్ డీజీపీ

Sun Aug 02 2020 21:30:14 GMT+0530 (IST)

Bihar police believe Rhea is the main culprit

సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముంబయి పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని వారిని కొందరు ప్రభావితం చేస్తున్నారు అంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ముంబయి పోలీసులు దాదాపుగా 40 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు వారందరిని కూడా బీహార్ పోలీసులు ప్రశ్నించేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే కొందరిని ప్రశ్నించగా మరికొందరిని ప్రశ్నించేందుకు రెడీ అయ్యింది.బీహార్ లో ఈ కేసు నమోదు అయినప్పటి నుండి రియా చక్రవర్తి అండర్ గ్రౌండ్ వెళ్లి పోయింది. ఆమెను బీహార్ పోలీసులు సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె మాత్రం జాడ లేదు. ఆమెను ప్రధాన నింధితురాలిగా బీహార్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను విచారించడం కీలకంగా మారింది. ఆమె కనిపిస్తే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. గత వారం రోజులుగా రియా చక్రవర్తి జాడ లేదని బీహార్ డీజీపీ కూడా పేర్కొన్నారు.

సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని ప్రశ్నించేందుకు నోటీసు ఇచ్చాం. ఇప్పటి వరకు ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని.. ఆమె ఏ తప్పు చేయకుంటే వెంటనే విచారణకు హాజరు అవ్వాలంటూ బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే అన్నారు. ఇప్పటికే ఆమె కోసం ఆమె ఇంట్లో మరియు సన్నిహితుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించాం. కాని ఆమె జాడ మాత్రం లేదని పాండే అన్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో రియా ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో కన్నీరు పెట్టుకుంటూ తాను ఏ తప్పు చేయలేదు దేవుడు ఉన్నాడు అంటూ వీడియోలో చెప్పింది. అయితే ఆ వీడియో ఎక్కడ నుండి అనేది మాత్రం క్లారిటీ లేదు.

ఇప్పటికే రియా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. సుశాంత్ ఆత్మహత్య కేసును ముంబయి పోలీసులకే అప్పగించాలని బీహార్ పోలీసులను ఆదేశించాలంటూ ఆమె విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. బీహార్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యేందుకు రియాకు ఎందుకు అంత భయం అంటూ సుశాంత్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.