బిగ్ బాస్ 5 తాజా జాబితా ఇదేనట.. మంగ్లీ ఔట్.. కారణం ఇదేనట

Sun Aug 01 2021 09:57:09 GMT+0530 (IST)

Bigg Boss 5 latest list is here

టీవీ కార్యక్రమాలన్ని టీఆర్పీ రేటింగ్ చుట్టూనే తిరుగుతాయన్న విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు పడే పాట్లు అన్నిఇన్ని కావు. ఇందుకోసం చించి.. చించి మరీ పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంటారు. అలా వేస్తున్న చానళ్లు సరికొత్త వినోదాన్ని అందించేందుకు వీలుగా కొత్త కార్యక్రమాల్ని తెర మీదకు తెస్తుంటాయి. అదే సమయంలో ఇతర భాషల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న షోలను తమకు తగ్గట్లుగా మార్చుకోవటం కనిపిస్తుంది. అలా కాస్తంత రూపం మార్చుకొని తెలుగులో సూపర్ హిట్ అయిన షో.. బిగ్ బాస్.ఒక సీజన్ కు మించి మరో సీజన్ కు వీక్షకుల ఆదరణ పెరగటమే కాదు.. దీని చుట్టూ మాట్లాడుకునే మాటలు అన్ని ఇన్ని కావు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమవుతోంది. గడిచిన కొద్ది నెలలుగా ఈ షోలో ఎంపికైన వారంటూ మస్తు లిస్టులు ఇప్పటికే తెర మీదకు వస్తున్నాయి. అన్ని బాగుంటే ఈ రియాల్టీ షోను మే లేదంటే జూన్ లో మొదలు పెట్టాల్సింది. కరోనా దెబ్బకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా.. బిగ్ బాస్ సీజన్ 5ను ఈ సెప్టెంబరులో స్టార్ట్ చేయాలన్న యోచనలో ఉన్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే సెట్ నిర్మాణంతో పాటు.. కంటెస్టెంట్ల ఎంపికతో పాటు.. అవసరమైన అన్ని అంశాల్ని ఫైనలైజ్ చేసినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరు 5న ఈ షోను స్టార్ట్ చేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ షోలో ఎవరు పాల్గొననున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. పలువురు సెలబ్రిటీల్ని.. యూట్యూబ్ స్టార్లను రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు. జాబితాలో ఫైనలైజ్ అయిన పేర్లుగా చెబుతున్న వారిని చూస్తే..
-  యాంకర్ వర్షిణి
-  యాంకర్ రవి
-  సినీ నటి సురేఖ వాణి
-  బుల్లితెర నటి నవ్యస్వామి
-  యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్
 -  హీరోయిన్ ఈషా చావ్లా
-  యాంకర్ శివ
-  శేఖర్ మాస్టర్
-  లోబో
-  సింగర్ మంగ్లీ
-  టీవీ9 యాంకర్ ప్రత్యూష
-  టిక్‌టాక్ స్టార్ దుర్గారావు
-  టీవీ నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంట
ఈ జాబితాలో ఉన్న మంగ్లీ మాత్రం షోకు తాను హాజరు కాలేనని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె చేసిన బోనం పాట వివాదాస్పదం కావటం.. ఆ వివాదం నుంచి బయటపడటం ఆమెకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇలాంటివేళ.. బిగ్ బాస్ 5లో పాల్గొంటే తనకు మరిన్ని కష్టాలు తప్పవన్న ఆలోచనలో ఆమె వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఆమెను షోలో పార్టిసిపేట్ చేయాలని చానల్ భావిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలు సాగుతున్నాయి. చివరికైనా సరే.. మంగ్లీని ఒప్పించి షోలోకి తీసుకుచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి.