బిగ్ బెట్టింగ్ తో భారీ చిత్రాల జాతర

Mon Nov 29 2021 12:00:52 GMT+0530 (IST)

Big Movies cast with big betting

సెకండ్ వేవ్ తర్వాత అగ్ర హీరోలు నటించిన క్రేజీ సినిమా ఏదీ విడుదల కాలేదు. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ రెండు నెలల్లో విడుదలకు భారీ చిత్రాలు రెడీ అయ్యాయి. ఎన్బీకే- బన్ని-నాని- పవన్ కల్యాణ్- ప్రభాస్ చిత్రాలు రేసులో ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి రేసులోనే వస్తోంది. తొలిగా నందమూరి బాలకృష్ణ అఖండతో సీజన్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు అమ్మారన్న గుసగుసల నేపథ్యంలో అంతే భారీ రిటర్నులు తేవాల్సి ఉంటుంది.డిసెంబర్ 2న విడుదలవుతున్న అఖండ బాలయ్య-బోయపాటి బృందానికి హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. అఖండ రిలీజ్ తర్వాత మరో పెద్ద చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ నటించిన పుష్ప డిసెంబర్ 17న విడుదలవుతోంది. ఈ చిత్రం బన్నీకి పాన్-ఇండియన్ అరంగేట్ర చిత్రంగా పాపులరైంది. ఇది కూడా అల్లు అర్జున్ - సుకుమార్ లకు హ్యాట్రిక్ మూవీ కానుంది. ఈ మూవీకి ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు మలయాళం హిందీలోనూ క్రేజు నెలకొంది. దాదాపు 200కోట్ల మేర థియేట్రికల్ డీల్స్ కుదిరాయని సమాచారం.

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింఘరాయ్ తన కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రమని చెబుతున్నారు. ఈ మూవీ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కూడా డిసెంబర్ 24న రికార్డు స్థాయిలో విడుదల కానుండగా బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. కీర్తి సురేష్ - గుడ్ లక్ సఖి .. నాగశౌర్య - లక్ష్యం డిసెంబర్ 10న విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు యూనిక్ కథాంశాలతో డీసెంట్ గా విడుదలవుతాయి.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన RRR జనవరి 7న అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో విడుదల కానుంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.500 కోట్ల మేర పలికింది. పవన్ కళ్యాణ్ -రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `భీమ్లా నాయక్` జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ పరంగా 100 కోట్ల మేర బిజినెస్ సాగింది.

ప్రభాస్ తదుపరి పాన్-ఇండియన్ ప్రయత్నం `రాధే శ్యామ్` జనవరి 12న విడుదలవుతోంది. థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. వంద కోట్లు అంతకుమించిన బిజినెస్ చేసిన ఈ సినిమాలు భారీ వసూళ్లను తేవాల్సి ఉంటుంది. మునుపటితో పోలిస్తే ఈసారి రిలీజ్ కి వస్తున్న సినిమాలకు కొన్ని చిక్కులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలతో ఆశించిన రెవెన్యూ సాధ్యపడదని పంపిణీ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఇతర మార్కెట్ల నుంచి వచ్చే రెవెన్యూ పైనే హోప్స్ ఉన్నాయి. నైజాం-అమెరికా మార్కెట్లపైనే భారీ ఆశలు పెట్టుకోవడం ఇటీవల చర్చనీయాంశమైంది.