స్టార్ హీరోల నటవారసులతో బిగ్ గేమ్ ప్లాన్!

Thu Jun 10 2021 11:00:01 GMT+0530 (IST)

Big Game Plan with Star Heroes

వారసుల్ని పరిచయం చేయడం అనేది అన్ని పరిశ్రమల్లో ఉన్నదే. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల వారసుల్ని వెండితెరకు పరిచయం చేసేందుకు దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా గుణశేఖర్ దృష్టిలో ఓ ఇద్దరు ప్రముఖ హీరోల వారసులు ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఆయన కొన్నేళ్ల క్రితం నందమూరి తారకరామారావుని `రామాయణం` చిత్రంతో బాలనటుడిగా పరిచయం చేశారు. ఇప్పుడు అదే తారకరాముని వారసుడు మాస్టర్ అభయ్ రామ్ ని శాకుంతలం చిత్రంలో ఓ బాలకుని పాత్రకు ఎంపిక చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.పురాణేతిహాసంలో ని ఓ కీలక ఘట్టం ఆధారంగా గుణ శాకుంతం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాళిదాసు శకుంతల రచన దీనికి ఆధారం. ఇందులో సమంత టైటిల్ పాత్రలో నటిస్తుండగా ఆమె భర్త దుష్యంతునిగా  దేవ్ మోహన్ నటిస్తున్నారు. వారి కుమారుడు భరత్ పాత్ర కోసం గుణ వేట సాగుతోంది.

ఆ క్రమంలోనే గుణశేఖర్ తనకు ఎంతో సన్నిహితులైన స్టార్ హీరోల పిల్లల్ని ఆ పాత్రకు ఎంపిక చేసే వీలుందని ప్రచారమవుతోంది. గుణశేఖర్ కి ఎన్టీఆర్ తో పాటు బన్ని కూడా చాలా క్లోజ్. బన్నితో ఇంతకుముందు రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రను చేయించారు. వరుడు చిత్రానికి కలిసి పని చేశారు. ఆ స్నేహం నేపథ్యంలోనే శాకుంతల చిత్రంలో బన్ని నటవారసుడు మాస్టర్ అల్లు అయాన్ నటించే వీలుందని ప్రచారం సాగుతోంది. నిజానికి ఇందులో రెండు కీలక బాల నటులకు ఆస్కారం ఉంటే ఆ ఇద్దరికీ అవకాశం ఇచ్చేవారేమో!

అయితే ఈ వార్తల్ని గుణశేఖర్ కానీ ఆయన టీమ్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. కానీ అలా జరిగితే బావుంటుందని బన్ని.. తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. గుణ టీమ్ వర్క్స్ - శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లలో నీలిమా గుణ- దిల్ రాజు నిర్మిస్తున్నారు. మోహన్ బాబు ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.