Begin typing your search above and press return to search.

ఒకే రోజున ఇటు 'భీమ్లా' .. అటు 'వలిమై'

By:  Tupaki Desk   |   27 Nov 2021 12:30 PM GMT
ఒకే రోజున ఇటు భీమ్లా .. అటు వలిమై
X
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'భీమ్లా నాయక్' రూపొందింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి రీమేక్. పవన్ కల్యాణ్ సరసన నాయికగా నిత్యామీనన్ నటించగా, మరో ప్రధానమైన పాత్రలో రానా నటించాడు. ఆయన జోడీగా తెలుగు తెరకి సంయుక్త మీనన్ పరిచయం కానుంది. పవన్ కల్యాణ్ కోరిక మేరకు త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - మాటలు అందించాడు. ఆయన హ్యాండ్ కూడా పడటంతో అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. రెండవ రోజునే ప్రభాస్ 'రాధేశ్యామ్' థియేటర్లకు రానుంది. పవన్ - ప్రభాస్ ల క్రేజ్ ను పోల్చి చెప్పడం కష్టం. సినిమాల బడ్జెట్ పరంగా చూసుకుంటే, 'రాధేశ్యామ్' పాన్ ఇండియా స్థాయి సినిమా. అయినా ఆ డేట్ ను మార్చుకోకుండా పవన్ అక్కడే ఫిక్స్ అయ్యాడు. ఇక ఒక వారం రోజుల ముందే 'ఆర్ ఆర్ ఆర్' థియేటర్లలో దిగిపోనుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. రాజమౌళి బ్రాండ్ వాల్యూ కలగలిసిన సినిమా.

అయినా పవన్ సినిమా వెనక్కి తగ్గడం లేదు. ముందుకు చెప్పినట్టుగానే జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా చెప్పారు. ఇక ఇక్కడ పవన్ కి ఏ స్థాయి క్రేజ్ ఉందో, తమిళనాట అజిత్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన హీరోగా బోనీకపూర్ నిర్మించిన 'వలిమై' సినిమాకి, హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. హ్యూమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. యాక్షన్ తో పాటు ఎమోషన్ తో కూడిన కథ ఇది. తమిళనాట సినిమాను కూడా జనవరి 12వ తేదీనే భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ మధ్య తమిళ హీరోలు తమ సినిమాలను తమిళంతో పాటు, తెలుగులోను అదే రోజున విడుదల చేస్తూ వస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే 'వలిమై' కూడా అలా వచ్చేదే. కానీ తెలుగులో సంక్రాంతి పండుగ సీజన్ కావడం .. పవన్ .. ప్రభాస్ .. రాజమౌళి సినిమాలు లైన్లో ఉండటం వలన ఇక్కడ కూడా 'వలిమై'ను అదే రోజున రిలీజ్ చేయకపోవచ్చు. సంక్రాంతికి ఇక్కడ భీమ్లా .. అక్కడ 'వలిమై' ఏ స్థాయి రికార్డులను సృష్టిస్తాయో చూడాలి మరి.