బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో భీష్మ

Wed Feb 26 2020 12:45:13 GMT+0530 (IST)

Bheeshma Movie Collections

యువ హీరో నితిన్.. రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'భీష్మ' బాక్స్ ఆఫీసు దగ్గర తన సత్తా చాటుతోంది.  పాజిటివ్ టాక్.. సూపర్ రివ్యూస్ రావడంతో 'భీష్మ' కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.  పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం కూడా 'భీష్మ' కు ప్లస్ గా మారింది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.35.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్రేకీవెన్ మార్క్ కు చేరువయింది.



'భీష్మ' థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.22.50 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ. 20.73 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించి సేఫ్ జోన్ లోకి వచ్చేసింది.  మరో రూ. 1.77 కోట్లు సాధిస్తే భీష్మ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర 'భీష్మ' జోరు చూస్తుంటే బయ్యర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి.  మరో రెండో మూడు వారాలు చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.  దీంతో నితిన్ కెరీర్లో 'భీష్మ' మరో సూపర్ డూపర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ సినిమాకు ముందు నితిన్ సినిమాలు వరసగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో 'భీష్మ' విజయం నితిన్ కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ దర్శకులకు రెండో సినిమా గండం ఉంటుందనే సెంటిమెంట్ ఉంది. ఈ నెగెటివ్ సెంటిమెంట్ ను దర్శకుడు వెంకీ కుడుముల బ్రేక్ చేసి మరీ విజయం సాధించాడు.