Begin typing your search above and press return to search.

ఆహాలో 'భీమ్లా'.. పవర్ తుపాన్ రాకను ఆహ్వానించిన పవన్ ఫ్యాన్స్..!

By:  Tupaki Desk   |   19 March 2022 5:30 PM GMT
ఆహాలో భీమ్లా.. పవర్ తుపాన్ రాకను ఆహ్వానించిన పవన్ ఫ్యాన్స్..!
X
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో మరో ఆరు రోజుల్లో పవర్ తుపాన్ ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి పోటీపడి నటించిన ''భీమ్లా నాయక్'' సినిమా మార్చి 25న డిజిటల్ వేదిక మీదకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆహా టీమ్ ప్రమోషన్స్ షురూ చేశారు.

ఇందులో భాగంగా శుక్రవారం 'భీమ్లా నాయక్' ఓటీటీ ట్రైలర్ ను ఆవిష్కరించారు. థియేట్రికల్ ట్రైలర్ లో చూడని కొన్ని సరికొత్త షాట్స్ తో కట్ చేయబడిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ స్పెషల్ కట్ ట్రైలర్ ను ఆహా బృందం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేత లాంచ్ చేయించారు.

''థియేట్రికల్ రిలీజ్ అయినా OTT రిలీజ్ అయినా.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఉండాల్సిందే. అభిమానులచే నిన్న ఆహా కట్ 'భీమ్లా నాయక్' ట్రైలర్‌ ను లాంచ్ చేయడంలో మేము క్రేజీ టైమ్‌ ను ఎలా గడిపామో చూడండి'' అంటూ దీనికి సంబంధించిన ఓ వీడియోని 'ఆహా' అధికారిక సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేశారు.

పవన్ ఫ్యాన్స్ ఆహా ఆఫీస్ లో 'భీమ్లా నాయక్' ఓటీటీ ట్రైలర్ ను ఆవిష్కరిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమాను ఆహా వాళ్ళు తీసుకోవడం వల్ల ఎప్పుడైనా తమ మొబైల్ లో పవన్ కల్యాణ్ ను చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం సినిమాలో పవన్ ఉపయోగించిన బుల్లెట్ మీద కూర్చొని ఫోటోలు దిగారు.

ఇక 'భీమ్లా..' ట్రైలర్ విషయానికొస్తే.. 'అడవి తగలబడటం చూసినా.. పులి మీద పడటం చూసినా కానీ.. ఆ పొద్దు నేను చూసింది వేరు దొర' అనే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. 'ఏయ్ పోలీస్.. నా లాంటి పెద్ద పెద్ద క్రిమినల్ని ఇంత ఫ్రీగా వదిలేస్తే ఎలా?' అంటూ రానా తన యాటిట్యూడ్ చూపించారు.

'ఇలాంటి వాళ్లకి రూల్స్, రెగ్యులేషన్స్, మంచి, మర్యాద మట్టీ మసానం ఇలాంటివేమీ పనిచేయవు..' వంటి పవన్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అలానే పవన్ - రానా మధ్య ఫైట్ సీన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య మడపతిప్పని యుద్ధం అనే లైన్ తో 'భీమ్లా నాయక్' చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని - రావు రమేష్ - మురళీ శర్మ - శత్రు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మించారు.

ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. రవి కె చంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన 'భీమ్లా నాయక్'.. ఓటీటీలో ఎలాంటి ఆదరణ అందుకుంటాడో చూడాలి.