పవర్ స్టార్ కూడా అన్నయ్య ని ఫాలో కావాల్సిందేనా

Mon Jan 17 2022 17:34:12 GMT+0530 (IST)

Bheemla Nayak Release Date

దేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కరోనా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో మళ్లీ సినిమాలకు గడ్డు రోజులు మొదలయ్యాయి. దీంతో పాన్ ఇండియా చిత్రాల నుంచి పేరున్న స్టార్ ల చిత్రాల వరకు వరుసగా వాయిదాపడుతున్నాయి. సంక్రాంతికి రావాల్సిన `ఆర్ ఆర్ ఆర్` రాధేశ్యామ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల కారణంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `భీమ్లా నాయక్` రిలీజ్ ని వాయిదా వేశారు.దీంతో ఈ మూవీ రిలీజ్ పిబ్రవరి 25కు మారింది. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ నటిస్తున్న `ఆచార్య` కూడా వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఈ మూవీ ఏప్రిల్ 1కి వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో మరో స్టార్ మూవీ కూడా వాయిదా పడే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లా నాయక్`.

త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల తమన్ డీజే వెర్షన్ అంటూ `భీమ్లా నాయక్` టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసి ఈ మూవీపై మరింత క్రేజ్ ని పెంచారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` మూవీని ఏప్రిల్ 1కి పోస్ట్ పోన్ చేయడం ఆ డేట్ లో విడుదల కావాల్సిన మహేష్ `సర్కారు వారి పాట` కూడా వాయిదా పడటంతో `భీమ్లా నాయక్` కూడా వాయిదా పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 14న రాఖీభాయ్ ``కేజీఎఫ్ చాప్టర్ 2` రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలని ట్రైలర్ మరో స్థాయికి  చేర్చింది. దీంతో ఈ మూవీతో పోటీపడేందుకు ఏ సినిమా సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో `భీమ్లా నాయక్` ఏప్రిల్ మొదటి వారాన్నే ఎంచుకునే అవకాశం వుందని మరో వాదన వినిపిస్తోంది.

అది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే అంటున్నారు. అంతే కాకుండా సమయాన్ని బట్టి సినిమాని రంగంలోకి దించాలని `భీమ్లా నాయక్` మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు రానా కూడా నటించారు. నిత్యామీనన్ సంయుక్త హెగ్డే  హీరోయిన్ లుగా నటించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కించారు.