ఒకప్పటి క్రేజీ స్టార్ ఈ హీరోయిన్ గుర్తుందా..

Fri Sep 24 2021 06:00:01 GMT+0530 (IST)

Bhanupriya younger sister is coming again

ప్రముఖ నటి.. ఒకప్పటి హీరోయిన్ భాను ప్రియ చెల్లెలు గుర్తుందా?.. శాంతి ప్రియ మళ్లీ వచ్చేస్తోంది. 1987లో వచ్చిన తమిళ చిత్రం `ఎంగ ఓరు పట్టుకారన్` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శాంతిప్రియ అక్క భానుప్రియ తరహాలోనే అందం.. అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తనదైన మార్కు గ్లామర్ ని ప్రదర్శించిన గ్లామర్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని దక్కించుకుంది.ఆ తరువాత మహర్షి రాఘవ హీరోగా నటించిన `వంశీ మహర్షి` మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి నటుడు తనికెళ్ల భరణి దర్శకుడు వంశీతో కలిపి రచనా సహకారం అందించారు. అప్పట్లో ప్రేమకథా చిత్రాల్లో ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆడియో పరంగా ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్గ్రీనే. ఆ తరువాత ఒకే ఏడాది తమిళంలో ఏడు చిత్రాల్లో నటించిన శాంతిప్రియ ఏడాది తరువాత జగపతిబాబు.. కృష్ణంరాజు నటించిన `సింహస్వప్నం`తో మళ్లీ తెలుగులో మెరిసింది.

యమపాశం.. కర్తకన్నీరు.. జస్టీస్ రుద్రమదేవి వంటి చిత్రాల్లో నటించింది. ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన `సౌగంధ్` సినిమాతో బాలీవుడ్ బాట పట్టింది. మేరే సజనా సాథ్ నిభానా.. పూల్ ఔర్ అంగార్...మెహెర్బాన్.. ఎక్కేపే ఎక్కా.. వంటి చిత్రాల్లో నటించింది. 1999లో హిందీ.. మరాఠీ చిత్రాల నటుడు సిద్ధార్ధ్ రాయ్ ని వివాహం చేసుకుని సినిమాకు గుడ్ బై చెప్పేసింది.

కొంత కాలం దూరదర్శన్లో ప్రసారమైన ఆద్యాత్మిక సీరియల్స్ లో నటించిన శాంతి ప్రియ ఆ తరువాత కంప్లీట్గా సినీ రంగాన్ని విడిచిపెట్టేసింది. అయితే మళ్లీ నటనపై గాలి మళ్లడంతో మళ్లీ నటించేందుకు రెడీ అవుతోంది. ఓ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. జీ స్టూడియోస్.. Mx ప్లేయర్ కోసం ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఆమె ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టుగా తమిళ వర్గాలు చెబుతున్నాయి.