'భాగీ 4' : ఈసారి ఏ సౌత్ మూవీని రీమేక్ చేస్తున్నారో..!

Thu Oct 29 2020 12:00:40 GMT+0530 (IST)

Bhaaghi Official Update Announced

బాలీవుడ్ లో 'భాగీ' ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు బ్యాడ్ టాక్ నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకున్నా కలెక్షన్స్ వైస్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే ఇప్పుడు 'భాగీ' సిరీస్ లో నాలుగో చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యారు. అయితే 'భాగీ' సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ సౌత్ సినిమాలకు రీమేక్ గా తెరకెక్కినవే. 'భాగీ'(2016) సినిమా తెలుగులో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా 'వర్షం' కి హిందీ రీమేక్ గా వచ్చింది. నాడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సాజిద్ నాడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రానికి షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. 'భాగీ 2'(2018) తెలుగు హిట్ సినిమా 'క్షణం' కి రీమేక్ గా రూపొందింది. సాజిద్ నాడియాద్వాలా నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 'భాగీ 3'(2020) మూవీ 'వేట్టై'(తెలుగులో 'తడాఖా') చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా అహ్మద్ ఖాన్ తెరకెక్కించారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు 'భాగీ 4' చిత్రానికి సన్నాహకాలు చేస్తున్నారు. నాడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సాజిద్ నాడియాద్వాలా నిర్మించే ఈ చిత్రానికి 'భాగీ 2' 'భాగీ 3' డైరెక్టర్ అహ్మద్ ఖాన్ తెరకెక్కించనున్నారు. ఈ సిరీస్ లో కూడా టైగర్ ష్రాఫ్ హీరోగా కొనసాగనున్నారు. ఇప్పటికే సాజిద్ తన రచయితల బృందంతో కలసి స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఇందులో కూడా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండేలా చూసుకుంటున్నారట. ఇప్పటికే మూడు సౌత్ మూవీస్ ని రీమేక్ చేసి బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన 'భాగీ' ఫ్రాంచైజీలో ఈసారి ఏ సౌత్ మూవీని రీమేక్ చేస్తున్నారో అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టైగర్ ష్రాఫ్ ఫస్ట్ మూవీ 'హీరోపంతి'('పరుగు' రీమేక్) చిత్రానికి సీక్వెల్ గా 'హీరోపంతి 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నాడియాద్వాలా నిర్మిస్తున్నారు. 'హీరోపంతి 2' షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు.