మరో పెద్ద రీమేక్ ఓటీటీలో రిలీజ్!

Tue Sep 29 2020 17:00:38 GMT+0530 (IST)

Bhaagamathie Hindi Remake To Release On OTT?

సౌత్ లో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఈజీగా 150 కోట్ల వసూళ్లు చేస్తుందని మేకర్స్ మరియు హీరో అభిమానులు భావించారు. కాని థియేటర్ల ఓపెన్ ఆలస్యం అవుతూ ఉండటంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల సినిమాను నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ఓటీటీ కూడా భారీ రేటును ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందుకే విడుదలకు రెడీ అయ్యారు అనే టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలో మరో సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.తెలుగులో అనుష్క నటించిన 'భాగమతి' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన అశోక్ హిందీలో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. భూమీ పడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆరు నెలల పాటు నిలిచి పోయింది. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు భారీ మొత్తాన్ని పెట్టేందుకు సిద్దంగా ఉందట. ఈ సినిమాకు అక్షయ్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం.