'ఆస్కార్' లో మరో కొత్త అవార్డ్

Fri Aug 10 2018 07:00:26 GMT+0530 (IST)

బాహుబలి సినిమా వెండితెర అద్భుతం.. గొప్ప కళాఖండం.. కానీ ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల బరిలో నిలువలేదు.. ఎందుకంటే బాహుబలి సినిమాలో సందర్భానుసారం కథ నడవదు. మధ్యలో కొన్ని ఆర్టిఫిషియల్ పాటలను పెట్టారు. ఆస్కార్ అవార్డుల్లో గెలవాలంటే కథలో ఎక్కడా ఇలాంటి డైవర్ట్ లు ఉండకూడదు. ముఖ్యంగా పాటలు కథలో భాగంగానే ఉండాలి. అంతేకాకుండా ఎక్కడా పొంతనలేని గ్రాఫిక్స్ వాడకూడదు. కానీ బాహుబలిలో ఊహకందని గ్రాఫిక్స్.. అసందర్భ పాటలున్నాయి. అందుకే ఈ సినిమా  దేశంలోని ప్రతిష్టాత్మక అవార్డులు - ఆస్కార్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ కాలేకపోయింది.బాహుబలినే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గ్రాఫిక్స్ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు దక్కలేదు. అందుకే  ఆస్కార్ టీం ఈ విభాగాన్ని పరిగణలోకి తీసుకుంది. ప్రపంచ అభిమానులను ఉర్రూత లూగించి బాక్సాఫీస్ రికార్డుల బద్దలుకొట్టిన గ్రాఫిక్స్ ప్రధాన పాపులర్ చిత్రాలకు అవార్డు ఇవ్వడానికి సంకల్పించింది.

ప్రపంచ సినిమాలకే అతిపెద్ద అవార్డు ఆస్కార్.. సినీ జీవితంలో ఈ అవార్డే అత్యుత్తమమైనదిగా భావిస్తారు సినీ ప్రముఖులందరూ.. అంతటి ప్రతిష్టాత్మక అవార్డుల విభాగంలో ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చి చేరింది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్’ అనే కొత్త కేటగిరిని అవార్డుల్లో చేర్చుతూ ఆస్కార్ అకాడమీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అకాడమీ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 2020 నుంచి ఆస్కార్ అవార్డుల్లో ఈ కొత్త ‘బెస్ట్ పాపులర్ అవార్డు’ను కూడా ఇవ్వనున్నారు.