ఇస్మార్ట్ రామ్ కి బీరుతో అభిషేకం

Fri Jul 19 2019 14:43:31 GMT+0530 (IST)

తమ అభిమాన హీరో కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయడం చూస్తున్నదే. థియేటర్ల ముందు భారీ కటౌట్లకు నిచ్చెనలు వేసుకుని మరీ అభిషేకాలు చేస్తుంటారు. అలాంటి సందర్భమే ఇది. నిన్న ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ సందర్భంగా విశాఖలోని జగదాంబ థియేటర్ ముందు ఇస్మార్ట్ శంకర్ కటౌట్ కి వైజాగ్ ఫ్యాన్స్ ఇలా వెరైటీగా అభిషేకించారు. ఇంతకీ వీళ్లు దేంతో అభిషేకం చేస్తున్నారో కనిపిస్తోంది కదూ?   పాలు.. పుష్పాలు.. జ్యూస్ లు అయితే రొటీన్ అనుకున్నారో ఏమో.. కాస్తంత వెరైటీగా ఇలా బీర్ పొంగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.ఈ వీడియో అటూ ఇటూ తిరిగి పూరి జగన్నాథ్ కి చేరినట్టుంది. ఆయన `మార్ ముంత` అనే శీర్షికతో ఇదీ ఇస్మార్ట్ ఆలోచన అంటే!! అంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఆ వీడియోని కాస్త పరిశీలనగా చూస్తే మరో సంగతి కనిపిస్తోంది.

ఫ్యాన్స్ బీర్ పొంగించే హడావుడిలో ఆ పక్కనే ఏం ఉన్నా పట్టించుకోవడం లేదు. చెయ్యి ఎత్తితే తాకేంత దూరంలోనే కరెంటు తీగలు కనిపిస్తున్నాయి. బీర్ పొంగించిన ఉత్సాహలో పొరపాటునా తాకితే ఇక అంతే కదా? ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు పొంచి ఉంటాయ్.. వీరాభిమానం కొంపకు చేటు తెస్తుంది. అందుకే ఫ్యాన్స్ ని ఉద్ధేశించి ప్రతి వేదికపైనా స్టార్లు ప్రమాదాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఆనందంలో ఉరకలెత్తే ఉత్సాహంలో ఏదైనా తప్పు జరిగితే అది తమని బాధిస్తుందని ప్రతిసారీ ఎన్టీఆర్.. చరణ్ లాంటి హీరోలు ఫ్యాన్స్ ని అభ్యర్థిస్తుంటారు అందుకే. అలాంటి సందర్భం రామ్ కి కూడా వచ్చిందేమో!!  రామ్ - పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చక్కని ఓపెనింగ్స్ తో ఆకట్టుకున్న  సంగతి తెలిసిందే.