చిత్రం : 'బంగారు బుల్లోడు'
నటీనటులు: అల్లరి నరేష్ - పూజా జవేరి - వెన్నెల కిషోర్ - పృథ్వీ - పోసాని కృష్ణమురళి - ప్రవీణ్ - అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: గిరి పాలిక
రాజేంద్ర
ప్రసాద్ తర్వాత కామెడీ చిత్రాలతో అంతగా తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో
అల్లరి నరేష్. కానీ అతను ఫామ్ కోల్పోయి చాలా కాలం అయింది. ‘సుడిగాడు’
తర్వాత హిట్టు కోసం అతడి దండయాత్ర కొనసాగుతూనే ఉంది. కొంత విరామం తర్వాత
అల్లరోడి నుంచి వచ్చిన కొత్త కామెడీ సినిమా ‘బంగారు బుల్లోడు’. ఈ రోజే
ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అయినా ‘నరేష్ ఈజ్ బ్యాక్’ అనిపించిందేమో
చూద్దాం పదండి.
కథ:
భవాని ప్రసాద్ (అల్లరి నరేష్) ఒక బ్యాంకు
ఉద్యోగి. ఓ వైపు ఆ ఉద్యోగం చేస్తూనే వంశ పారంపర్యంగా వచ్చిన బంగారం పనిలో
తన తాతకు సాయపడుతూ జీవనం సాగిస్తుంటాడతను. ఐతే ఒక రోజు అనారోగ్యం పాలైన
ప్రసాద్ తాత.. అతడికో రహస్యం చెబుతాడు. ప్రమాదంలో చావు బతుకుల్లో ఉన్న
ప్రసాద్ తల్లిదండ్రులను కాపాడుకోవడం కోసం అమ్మవారి నగలు అమ్మేసి వాటి
స్థానంలో గిల్టు నగలు పెట్టినట్లు వెల్లడిస్తాడు. ఆ పాపం తన కుటుంబాన్ని
వెంటాడుతోందని తాత మనో వేదనకు గురవుతుండటంతో ఏం చేసైనా అమ్మవారికి నగలు
చేయించాలని ప్రసాద్ నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతనేం చేశాడు.. ఈ క్రమంలో
అతడికి ఎదురైన పరిణామాలేంటి అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
అల్లరి
నరేష్ హిట్ సినిమాల్లో చాలా వరకు అతడి తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన
రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలే. ఆయన తరహా కామెడీ ఎలా ఉండేదో కొత్తగా
చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాల్లో చెప్పుకోదగ్గ కథేమీ ఉండేది కాదు కానీ..
బోలెడంతమంది కమెడియన్లు కలిసి చేసే మాస్ కామెడీతోనే కాలక్షేపం అయిపోయేది.
ఈవీవీ తీర్చిదిద్దే పాత్రల్లో ఒక రకమైన అతి ఉంటుంది. వెటకారం కనిపిస్తుంది.
సినిమాలో ఇంకేం లేకపోయినా కామెడీతోనే ప్రేక్షకులు సంతృప్తి చెందేవాళ్లు.
ఐతే ఈవీవీ వెళ్లిపోయాక నరేష్ కు సరిపడే సినిమాలు తీయడంలో అతడి సినిమాల
నుంచి ప్రేక్షకుల ఆశించే వినోదాన్ని అందించడంలో చాలామంది దర్శకులు
విఫలమయ్యారు. స్పూఫ్ కామెడీతో ‘సుడిగాడు’ లాంటి కొన్ని సినిమాలు ఆడేశాయి
కానీ.. ఆ టైపు కామెడీ ఔట్ డేట్ అయిపోయాక నరేష్ అగమ్య గోచరంగా మారింది. ఇటు
స్పూఫులూ వర్కవుట్ కాలేదు. ఈవీవీ మార్కు సినిమాలూ పడలేదు. ఈ నేపథ్యంలో
‘నందిని నర్సింగ్ హోం’తో దర్శకుడిగా పరిచయమైన గిరి పాలిక.. ఈవీవీ టైపు కథతో
నరేష్ ను ఫామ్ లోకి తీసుకురావాలని చూశాడు. కానీ ఆ ప్రయత్నం ఎంతమాత్రం
ఫలితాన్నివ్వలేదు. ఔట్ డేట్ అయిపోయిన కథకు తోడు కామెడీ పెద్దగా వర్కవుట్
కాని సన్నివేశాలతో ‘బంగారు బుల్లోడు’ ఒక సాధారణ సినిమాగా మిగిలిపోయింది.
నరేష్
సినిమా అంటే ఎప్పుడైనా సరే.. ప్రేక్షకులు ప్రధానంగా ఆశించేది కామెడీనే.
అతడి చిత్రమంటే కాసేపు హాయిగా నవ్వుకుని వెళ్లొచ్చని ప్రేక్షకులు
థియేటర్లకు వచ్చేవాళ్లు. కానీ అతను చేసిందే చేసి జనాలకు మొహం మొత్తేలా
చేశాడు. ఇప్పుడు ‘బంగారు బుల్లోడు’లో కూడా అతను కొత్తగా చేసిందేమీ లేదు.
గుడి.. అమ్మవారి నగల దొంగతనం.. వాటి స్థానంలో గిల్టు నగలు.. ఈ తరహా కథ
అనగానే ప్రేక్షకులు రెండు మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లిపోవడం ఖాయం.
బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన నగల్ని హీరో తన అవసరాల కోసం
వాడేసుకోవడం.. అందులోనూ ఊరిలో అందరిలోకి దుర్మార్గుడిగా పేరున్న వ్యక్తి
నగల్నే హీరో ఉపయోగించుకోవడం అన్న పాయింట్ మొదట్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.
మధ్యలో నగల దొంగతనానికి సంబంధించి మధ్యలో కొంత ఉత్కంఠ కూడా కనిపిిస్తుంది.
కానీ ఈ రెండు విషయాలనూ ఒక దశ దాటాక తేల్చి పడేశారు. తాను ఎదుర్కొన్న
చిక్కుల నుంచి హీరో ఎలా బయటపడతాడనే ఉత్కంఠే లేకుండా కథను పక్కదోవ
పట్టించేశారు. కథ ఎక్కడా ఒక పద్ధతి ప్రకారం నడవదు. ఏవేవో అంశాలు వచ్చి
డైల్యూట్ చేసేశాయి.
నరేష్ సినిమాల్లో కామెడీ వర్కవుట్ అయితే కథ
గురించి లాజిక్కుల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ‘బంగారు
బుల్లోడు’లో అది కూడా వర్కవుట్ కాలేదు. తొలి అరగంటలో అసలు కామెడీ అన్నదే
లేదు. వెన్నెల కిషోర్ పాత్ర రంగంలోకి దిగాక కొంత ఉపశమనం దక్కుతుంది.
అతనున్నంతసేపూ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. కానీ ఆ పాత్రను ఎక్కువ సేపు
కొనసాగించలేదు. అతను నిష్క్రమించగానే సినిమా మళ్లీ నత్త నడకన సాగుతుంది.
ద్వితీయార్ధంలో కిషోర్ మళ్లీ తిరిగొచ్చినా కూడా పెద్దగా నవ్వించలేకపోయాడు.
కథలో కొన్ని ట్విస్టుల వల్ల.. కిషోర్.. పోసాని కృష్ణమురళి పాత్రల వల్ల
ఫస్టాఫ్ ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. సెకండాఫ్ మాత్రం పూర్తిగా
తేలిపోయింది. హీరో హీరోయిన్ల ప్రేమకథలో అసలేమాత్రం విషయం లేకపోవడం.. పాటలు
బలవంతంగా ఇరికించడం.. కథ ఒక దారీ తెన్నూ లేకుండా సాగడంతో సినిమా చివరికి
వచ్చేసరికి ప్రేక్షకులకు శిరోభారం తప్పదు. ముగింపు కూడా పూర్తిగా తేల్చి
పడేశారు. ఈ టైపు సినిమాలతో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాక కూడా నరేష్..
‘బంగారు బుల్లోడు’ ఎందుకు చేశాడన్నది అర్థం కాని విషయం. సహాయ పాత్రలైనా
అంతో ఇంతో నవ్విస్తున్నాయి కానీ.. నరేష్ కామెడీ పండించలేకపోవడాన్ని బట్టి
అతను మారాల్సిన అవసరాన్ని ‘బంగారు బుల్లోడు’ గుర్తు చేస్తుంది.
నటీనటులు:
అల్లరి
నరేష్ సరిగా చేయలేదు అనలేం కానీ.. అతణ్ని చూస్తే ఇంతకుముందులా
ప్రేక్షకులకు నవ్వు రావట్లేదన్నది వాస్తవం. ఇంతకుముందు చాలాసార్లు చేసిన
పాత్రల్లాగే అనిపిస్తుంది తప్ప భవానీ ప్రసాద్ క్యారెక్టర్లో ఏ విశేషం లేదు.
నరేష్ ఆత్మవిశ్వాసం కోల్పోయిన విషయం అతడి లుక్స్ లో కనిపిస్తుంది.
సినిమాలో అతనంత హుషారుగా కనిపించలేదు. హీరోయిన్ పూజా జవేరి పాటల్లో అందంగా
కనిపించింది కానీ.. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. పోసాని
కృష్ణమురళి వడ్డీ వ్యాపారి పాత్రలో రాణించాడు. కొన్ని సన్నివేశాల్లో
నవ్వించాడు. వెన్నెల కిషోర్ కాసేపు ప్రేక్షకులకు ఉపశమనాన్నిచ్చాడు.
తనికెళ్ల భరణి హీరో తాత పాత్రలో బాగానే చేశాడు. ప్రవీణ్ నటన ఓకే. మిగతా
వాళ్లు మామూలే.
సాంకేతిక వర్గం:
సాయికార్తీక్ పాటల్లో
గుర్తుంచుకోదగ్గవి ఏవీ లేవు. ‘బంగారు బుల్లోడు’ టైటిల్ పెట్టారు కాబట్టి
‘స్వాతిలో ముత్యమంత..’ పాటను రీమిక్స్ చేసినట్లున్నారు కానీ.. ఆ పాట
పేలవంగా అనిపిస్తుంది. ఆ పాట చిత్రీకరణ కూడా బాగా లేదు. సాయికార్తీక్
నేపథ్య సంగీతం కూడా సాధారణమే. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం సినిమాకు తగ్గట్లు
పాత స్టయిల్లోనే నడిచింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు గిరి పాలిక
పనితీరు చూస్తే అతను ఈవీవీ స్కూల్ ను ఫాలో అయినట్లు అనిపిస్తుంది. అతడి
నరేషన్ అంతా పాత తరహాలో సాగింది. వెన్నెల కిషోర్.. పోసాని కృష్ణమురళి
పాత్రల వరకు కొంత కామెడీ పండించాడు కానీ.. మిగతా వ్యవహారమంతా తేలిపోయింది.
చివరగా: బంగారు బుల్లోడు.. మెరుపుల్లేవ్..!!
రేటింగ్-2/5
Disclaimer
: This Review is An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theatre