పండుగ సీజన్ ని బాగానే సొమ్ము చేసుకున్నారు.. కానీ..?

Wed Jan 19 2022 13:43:49 GMT+0530 (IST)

Bangarraju 2022 Sankranthi Hit

2022 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ''బంగార్రాజు'' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సోగ్గాళ్ళు మళ్ళీ వచ్చారు అంటూ కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య కలిసి థియేటర్లలో చేసిన సందడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నాలుగు నెలల్లోనే సినిమాని పూర్తి చేసిన మేకర్స్.. ఈ పండగ సీజన్ లో రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నారు. పోటీలో మరో పెద్ద సినిమా లేకపోవడం కూడా అక్కినేని తండ్రీకొడుకులకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి.'బంగార్రాజు' సినిమా మొదటి మూడు రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్ లో చేరినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని హైర్ బేసిస్ మీద కొనుకున్న వాళ్ల ప్రాఫిట్స్ ను పక్కనపెడితే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓన్ గా రిలీజ్ చేసిన నైజాం వంటి పలు ఏరియాలు మినహా.. ఐదో రోజుతో కొన్ని మెయిన్ సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలకి హ్యాపీగా నాన్ థియేట్రికల్ మీదనే లాభాలు వచ్చేశాయని తెలుస్తోంది. అయితే నాన్ థియేట్రికల్ తో పాటు థియేట్రికల్ రైట్స్ కూడా సొంతం చేసుకున్న జీ గ్రూప్ వారికి లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో చూడాలి. అధిక వసూళ్ళు తెచ్చిపెట్టిన ఏపీలో ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో పాటుగా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

కాగా 'బంగార్రాజు' చిత్రాన్ని సోషియో ఫాంటసీ ఔట్ అండ్ ఔట్ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఇది బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వెల్. బంగార్రాజుగా నాగార్జున కనిపించగా.. ఆయన మనవడు చిన బంగార్రాజుగా నాగచైతన్య అలరించారు. నాగ్ కు జోడీగా రమ్యకృష్ణ.. చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.