పవన్ సీఎం అబ్బా..బండ్ల మళ్లీ మొదలెట్టాడు!

Thu Sep 19 2019 12:56:01 GMT+0530 (IST)

Bandla Ganesh Praises Pawan kalyan

బండ్ల గణేష్.. కొద్దిరోజుల క్రితం వరకూ టాలీవుడ్ నటుడు నిర్మాత.. పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి అధికారప్రతినిధి అయ్యాడు. ఆ సమయంలోనే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాకుంటే ‘7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటా’నని సంచలన ప్రకటన చేశాడు. ఎన్నికలు అయిపోయాయి.. కాంగ్రెస్ ఓడింది. బ్లేడ్ పట్టుకొని కొందరు మీడియా జర్నలిస్టులు ఆయన ఇంటి ముందు కాపు కాయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బండ్ల గణేష్.. ఓ ఫైన్ మార్నింగ్ తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు.. ఇక భవిష్యత్ లో ఏ రాజకీయ పార్టీతోనూ రాజకీయ నేతలతోనూ కలువను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు.. కట్ చేస్తే మళ్లీ బండ్ల గణేష్ తన మనుసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది..

తన గాడ్ ఫాదర్ - జనసేనాని పవన్ కళ్యాణ్ పై తాజాగా బండ్ల గణేష్ ప్రేమను ఒలకబోసాడు.. ‘పవన్ కు - తనకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని.. శరీరాలు వేరైనా తమ మనసులు ఒకటేనని’ బండ్ల చెప్పుకొచ్చాడు. పవన్ లోని ఆవేశం - ఆవేదన అంతా రాష్ట్ర ప్రజల కోసమేనని  చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన వ్యక్తి అని.. ఏదో ఒక రోజు  ముఖ్యమంత్రి అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను భగవంతుడు తయారు చేసిన అరుదైన వ్యక్తి అంటూ ఓ రేంజిలో  ల పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ సీఎం అయితే అది ఏపీ ప్రజలకే అదృష్టమని బండ్ల తెలిపారు. ముఖ్యమంత్రికి కావలసిన అన్ని అర్హతలు పవన్ కు ఉన్నాయని తెలిపాడు.

ఇలా రాజకీయాలు వదిలేశానని.. దూరంగా ఉంటానని చెప్పిన బండ్ల మళ్లీ నాలుక మడతేశాడు.. తనకు ఇష్టమైన పవన్ పై ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. ఈ లెక్కన చూస్తే మళ్లీ మన బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వస్తారా? జనసేనలో చేరుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. ప్రస్తుతానికైతే రాజకీయాలకు రిటైర్ ఇచ్చేసి మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నారు.