Begin typing your search above and press return to search.

ప్యానెల్ లేకుండానే బండ్ల బ‌రిలోకి

By:  Tupaki Desk   |   24 Sep 2021 3:30 PM GMT
ప్యానెల్ లేకుండానే బండ్ల బ‌రిలోకి
X
`మా` ఎన్నిక‌లు రోజుకో ర‌స‌వ‌త్త‌ర మ‌లుపు తిరుగుతున్నాయి. మాజీ అధ్య‌క్షుడు న‌రేష్ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఎన్నిక‌లు అనివార్యంగా మారిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఎన్నిక‌ల తేదీని ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 10న `మా` ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో పోటీకోసం అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌కాష్‌రాజ్ పోటీప‌డుతుండ‌గా.. ఆయ‌న ప్యాన‌ల్ నుంచి చాలా మందే పోటీకి రెడీ అయిపోయారు.

ఇప్ప‌టికే ప‌లు మార్లు ప్రెస్ మీట్ లు పెట్టి తాను ఏం చేయాల‌నుకుంటున్నానో.. ఏం చేస్తానో అంటూ ప్ర‌కాష్ రాజ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని ఇటీవ‌ల వెల్ల‌డించారు. తాజాగా స్టార్ హీరోల‌పై చేసిన విమ‌ర్శ‌లు.. జెనీలియా స‌భ్య‌త్వంపై మాట్లాడిన తీరు చాలా మందిలో స‌రికొత్త ఆలోచ‌న‌లు రేకెత్తించింది. కొంత మంది స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌.. నాగ‌చైత‌న్య ఓటు హ‌క్కు ఉన్నా ఓటు వేయ‌ర‌ని లెక్క‌లు చెప్పుకొచ్చారు.

ఇలా ప్ర‌కాష్ రాజ్ ప్ర‌చారం జోరుగా సాగిస్తుంటే అధ్య‌క్ష‌ప‌ద‌వికి ప్ర‌కాష్ రాజ్ కు పోటీ మంచు విష్ణు నిలిచారు. తాను `మా` ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నానంటూ ముందే ప్ర‌క‌టించినా ప్యానెల్ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు మొత్తం స‌భ్యుల‌ని రెడీ చేసుకుని శుక్ర‌వారం మంచు విష్ణు మీడియా ముందు కొచ్చారు. త‌న ఎజెండాని ప్ర‌క‌టించారు.

ఇదిలా వుంటే ప్ర‌కాష్ రాజ్ ని ర‌హ‌స్య విందులు.. గ్రూపు రాజ‌కీయాల విష‌యంలో కడిగిపారేసిన బండ్ల గ‌ణేష్ తాజాగా సడెన్ షాక్ ఇచ్చాడు. ఎలాంటి ప్యానెల్ లేకుండా.. ఏ ప్యానెల్ తో సంబంధం లేకుండా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పోటీకి దిగుతున్న‌ట్టుగా శుక్ర‌వారం ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ వ‌ర‌కు మీకు ఇష్ట‌మైన వారికి ఓటేయండ‌ని కానీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పోటీ చేస్తున్న త‌న‌కి మాత్రం ఖ‌చ్చితంగా ఓటు వేయండ‌ని ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ చిత్రం చూసిన వారంతా అక్టోబ‌ర్ 10 న జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల తేదీ వ‌ర‌కు `మా` ఎన్నిక‌ల్లో ఇంకా ఎలాంటి చిత్రాలు చూడాలో అంటూ సెటైర్లు వేస్తున్నారు.