యాత్ర నిర్మాతలతో బాలయ్య మూవీ?

Mon Nov 29 2021 21:13:36 GMT+0530 (IST)

Balayya movie with Yatra producers

నటసింహా నందమూరి బాలకృష్ణ డిసెంబర్ లో అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి  శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన `అఖండ` డిసెంబర్ 2న భారీ అంచనాల మధ్య  రిలీజ్ అవుతోంది.  `సింహ`..`లెజెండ్` తర్వాత  ఈ జోడీ చేస్తోన్న సినిమా కావడంతో హ్యాట్రిక్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంతకంతకు అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుసగా కమిట్ మెంట్లు అన్ని పూర్తి చేయనున్నారు. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా...డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా ముందు పూర్తి చేస్తారు.ఇప్పటికే గోపీచంద్ మలినేనితో చేస్తోన్న సినిమా ప్రారంభోత్సం కూడా పూర్తయింది. నవంబర్ 13న సినిమా లాంచ్ అయ్యింది. అఖండ రిలీజ్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అలాగే పూరితో చేయనున్న సినిమాని పూరి కనెక్స్ట్ స్వయంగా నిర్మిస్తుంది. తాజాగా బాలయ్య మరో కొత్త సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. యాత్ర మేకర్స్- 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరగనుందని సమాచారం.

ఈ  సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర కాస్టింగ్ సహా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే గోపీచంద్ మలినేని సినిమా తర్వాత పూరీతో సినిమా ని వాయిదా వేసి ముందుగా ఈచిత్రాన్నే పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇంకా బాలయ్యకు సీనియర్ దర్శకులు  సింగీతం శ్రీనివాసరావు.. అనీల్ రావిపూడితోనూ కమిటెంట్లు ఉన్నాయి. ఇప్పటికే అనీల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. అతని బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్ వాయిదా పడుతోంది.