ఎప్పుడూ చూడని సీన్లు చూపిస్తున్న బాలయ్య మాసిజం

Sun Dec 05 2021 20:00:01 GMT+0530 (IST)

Balayya Akhanda showing rare scenes

చిత్ర కథానాయకుడు మాత్రమే కాదు.. దర్శకుడు.. ఆ మాటకు వస్తే.. సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత కూడా ఊహించని రీతిలో సర్ ప్రైజ్ ఇచ్చింది బాలయ్య నటించిన తాజా బ్లాక్ బస్టర్ 'అఖండ'. విడుదలకు ముందు ల్యాబ్ లో సినిమా రష్ ను చూసి బాగుందని.. విజయం ఖాయమన్న మాట వినిపించింది. అయితే.. ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయే తప్పించి.. భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం లేదు. అలాంటిది.. ఒక్కసారి వెండితెర మీద అఖండ బొమ్మ పడిన తర్వాత నుంచి బాక్సాఫీస్ శివాలెత్తి పోయింది.కరోనా దెబ్బకు కిందా మీదా పడుతున్న సినిమా థియేటర్లకు కొత్తగా ప్రాణమొచ్చినట్లైంది. మహమ్మారి పుణ్యమా అని వెలవెలబోతున్న థియేటర్లు కళకళలాడేలా చేసిన క్రెడిట్ అఖండ ఖాతాలోకే వేయాలి. ఒక సినిమా సక్సెస్ కావటం వేరు.. చరిత్రను క్రియేట్ చేయటం వేరు. అఖండ ఫలితం మాత్రం రెండో కోవలోకే వస్తుందని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఒక అగ్ర హీరో నటించిన సినిమా విడుదల కావటం.. అదే సమయంలో ఒమిక్రాన్ టెన్షన్ పట్టి పీడుస్తున్న వేళ.. అలాంటి భయాల్ని మడిచి పెట్టేసి.. థియేటర్లకు వెళ్లి సందడి చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అఖండ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సీన్లు చోటు చేసుకోవటమే కాదు.. ఇలాంటివి విని చాలా కాలమైందిరా అనిపించే ఉదంతాలుచోటు చేసుకున్నాయి. జన జీవన స్రవంతికి దూరంగా ఉంటూ.. తమ లోకంలో గడిపే అఘోరాలు.. సినిమాను చూడటానికి థియేటర్లకు రావటం ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా. ఆ కొరతను తీర్చేసింది అఖండ.

తాజాగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బంగ్రాజు థియేటర్ కు అఘోరాలు వచ్చి సందడి చేశారు. థియేటర్లో సినిమా చూసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అఘోరాలు సైతం బాలయ్య ఫ్యాన్స్ అయిపోయారని.. ఆయన అభిమానులు అంటుంటే.. ఈ సినిమాలో అఘోరా పాత్రను చూడటానికి వచ్చినట్లు చెబుతున్నారు. సినిమా తర్వాత థియేటర్ వద్ద కాసేపు కూర్చున్న వారు.. బాలయ్య అభిమానులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ కొన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి.

అక్కడెక్కడో అమెరికాలోని థియేటర్లలో అఖండ మూవీని చూస్తూ.. ఎంజాయ్ చేయటం.. అనకాపల్లిలోని థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తారో.. అచ్చు అలానే చేస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మరోవైపు.. బెంగళూరు ఊర్వశి థియేటర్ లో.. హౌస్ ఫుల్ బోర్డు పెట్టి దాదాపు నాలుగేళ్లు అయ్యిందని.. అఖండ పుణ్యమా అని ఇన్నాళ్లకు థియేటర్ హౌస్ ఫుల్ బోర్డు పెట్టారని చెబుతున్నారు. శనివారం ఈవినింగ్ షోకు థియేటర్ నిండిందని బోర్డు పెట్టటంతో.. సినిమా చూద్దామని వచ్చిన వారు నిరాశకు గురై వెళ్లిపోయారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ''అఖండ''. మాసిజం ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందన్న విషయాన్ని బాలయ్య తన తాజా మూవీతో చెప్పేశారని చెప్పాలి.