అఖండ' మాస్ జాతర: మేం తల దించుకోం.. తల తెంచుకుని వెళ్లిపోతాం..!

Sat Nov 27 2021 22:19:30 GMT+0530 (IST)

Balakrishna promises Mass Jathara in Theatres

నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.శిల్పకళా వేదికలో జరుగుతున్న 'అఖండ' వేడుకకు చిత్ర బృందంతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు - దర్శకధీరుడు రాజమౌళి - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'అఖండ మాస్ జాతర' పేరుతో రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రోల్ అనూహ్య స్పందన తెచ్చుకోగా.. తాజాగా వచ్చిన మాస్ జాతర నందమూరి అభిమానులకు గూస్ బమ్స్ తెప్పిస్తోంది.

'అఖండ' సినిమాలో బాలయ్య పోషిస్తున్న రెండు పాత్రల చూపిస్తూ కట్ చేసిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా 'నేనే.. త్రిపురానాశక రక్షకుడు.. శివుడు' అంటూ ప్రారభమైన అఘోరా పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది గుర్తుండిపోయే క్యారక్టర్ అవుతుందని చెప్పవచ్చు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయనడానికి ఈ రిలీజ్ ట్రైలర్ ఒక ఉదాహరణ.

బాలయ్య తనదైన శైలిలో చెప్పిన 'మేం ఎక్కడికైనా వస్తే తల దించుకోం.. తల తెంచుకుని వెళ్ళిపోతాం..' 'దేవుణ్ణి కరుణించమని అడుగు.. కనిపించమని కాదు..' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి ఎస్ఎస్ థమన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ సి రామ్ ప్రసాద్ విజువల్స్ బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. మొత్తం మీద 'అఖండ మాస్ జాతర' సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పాలి.

'అఖండ' చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా కనిపించగా.. జగపతిబాబు - పూర్ణ - కాలకేయ ప్రభాకర్ ఇతర పాత్రలు పోషించారు.