'అఖండ'కి అటు బాలకృష్ణ .. ఇటు తమన్!

Sat Dec 04 2021 11:34:10 GMT+0530 (IST)

Balakrishna and Thaman Effort For Akhanda

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ ఇస్తుందా .. లేదా? అనే కుతూహలం అభిమానుల్లో పెరిగిపోతూ వచ్చింది. అయితే సినిమా రిలీజ్ తరువాత మరో ఆట వరకూ కూడా ఈ కుతూహలం కొనసాగలేదు. హ్యాట్రిక్ హిట్ పడిపోయిందనే విషయం మొదటి ఆటతోనే అర్థమైపోయింది.దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య అభిమానుల సందడే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా రివ్యూలు చూస్తే .. బాలకృష్ణ .. బోయపాటి తరువాత తమన్ పేరు వినిపిస్తోంది.

తమన్ ఈ సినిమాకి మంచి బాణీలు కట్టాడు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. సాధారణంగా సంగీత దర్శకులు ఒక సినిమా రికార్డింగ్ థియేటర్ ను దాటేసి వెళ్లిపోయిన తరువాత ఆ సినిమాకి సంబంధించిన విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. ఆ సినిమా ప్రమోషన్స్ ను గురించి కూడా అంతగా పట్టించుకోరు.

కానీ తమన్ అలా కాదు. తన చేతికి ఒక ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియా ద్వారా ఆ సినిమా అప్ డేట్స్ ను అందిస్తూనే ఉంటాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ దగ్గర నుంచి అన్ని విషయాలు ట్విట్టర్ ద్వారా బయటికి వస్తూనే ఉంటాయి.

కథాకథనాల పరంగా ఎలాంటి పాయింట్ ను ఆయన లీక్ చేయడు. కాకపోతే ఆ సినిమా ఎలా ఉండబోతోంది? ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాబోతోంది? ఆ సినిమాలోని పాటల్లో .. ఏ పాట ప్రత్యేకత ఏమిటి? బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏమిటి? అనే విషయాలను ఆయన ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఆ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వెళుతుంటాడు.

హీరోతో పాటు .. దర్శక నిర్మాతలతో పాటు ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అలా 'అఖండ' కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన ఈ సినిమా కోసం 120మంది సింగర్స్ తో పాడించినట్టుగా .. 40 రోజులుగా సరిగ్గా నిద్రలేకుండా పనిచేసినట్టు చెప్పాడు.

అఘోర ఇంట్రడక్షన్ .. ఆయనకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఎంతో కసరత్తు చేశామని అన్నాడు. నిజంగానే ఆయన కష్టం తెరపై కనిపించింది .. వినిపించింది. ఈ సినిమా విషయంలో తమన్ పాత్ర చాలా ప్రధానమైనదనే విషయాన్ని అంతా బలంగా చెబుతున్నారు.

ఎప్పటికప్పుడు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో రేంజ్ కి తీసుకుని వెళుతూ బాలకృష్ణ స్థాయిని నిలబెట్టేశాడని అంటున్నారు. ఆ స్థాయిలో తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే కచ్చితంగా కొన్ని సీన్స్ తేలిపోయేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించడంలో అటు బాలకృష్ణ .. ఇటు తమన్ కీలకమైన పాత్రలను పోషించారని అంటున్నారు. ఈ ఇద్దరినీ కరెక్టుగా ఉపయోగించుకోవడంలోనే బోయపాటి సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.