నందమూరి ఫ్యామిలీని దూరం పెడుతున్నారా...?

Fri May 29 2020 12:30:53 GMT+0530 (IST)

Balakrishna Sensational Comments on Telugu Film Industry Celebrities

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు జాతి.. తెలుగు సినిమా ప్రపంచం గురించి ఎలుగెత్తి చాటి చెప్పారు. తెలుగు జాతి గురించి ప్రస్థావించాల్సి వచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్ పేరు కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. అటు సినిమాలతో ఇటు రాజకీయాలతోను తెలుగు వారి గుండెల్లో చీర స్థాయిగా మిగిలిపోయారు. అందుకే తెలుగు జాతి మొత్తం ప్రేమగా 'అన్న' అని సంబోధించుకుంటుంది. నందమూరి ఫ్యామిలీ రామారావు నుండి ఇండస్ట్రీలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఎన్టీఆర్ నటవారసులుగా హరికృష్ణ బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. హీరోలుగా నిర్మాతలుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా రామకృష్ణ సినీ స్టూడియో ఏర్పాటు చేసి ఇండస్ట్రీ అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మూడో తరం వారసులుగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు వరుసగా సినిమాలను తీస్తూ.. సినిమాలను నిర్మిస్తూ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. నిజానికి సినీ ఇండస్ట్రీని మద్రాస్ నుండి హైదరాబాద్ కి తీసుకురావడంలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు ఎన్టీఆర్ కృషి కూడా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన నందమూరి ఫ్యామిలీని ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం పెడుతున్నారంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో సినిమా షూటింగ్స్ కు అనుమతులు కల్పించాలంటూ టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ తోనూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చర్చలు జరిపారు. నిన్న తలసాని తో మరోసారి ఇండస్ట్రీ పెద్దలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశాలన్నిటిలో నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ కనిపించలేదనేది నందమూరి ఫ్యాన్స్ వాదన. మెగా ఫామిలీ నుండి.. దగ్గుబాటి ఫ్యామిలీ.. అక్కినేని ఫ్యామిలీ నుండి ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు.. కానీ నందమూరి ఫ్యామిలీ సభ్యులు ఎక్కడా కనిపించలేదని.. కావాలనే ఆ ఫ్యామిలీని దూరం పెడుతున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని.. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశానికి తనను ఎవరూ పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీ వారు నందమూరి ఫ్యామిలీని పట్టించుకోవడం లేదనే వార్తలు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్ ఫ్యామిలీని వారు ఇన్వైట్ చేయలేదో.. ఇన్వైట్ చేసినా వారు రాలేదో తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి సమావేశాల్లో ఒక్కరు కూడా లేరన్న మాట వాస్తవమని.. ఇంతమంది సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమ ఎదురుకుంటున్న కష్టాలపై చర్చిస్తున్న నేపథ్యంలో దీనిపై నందమూరి ఫ్యామిలీ వారికి సమాచారం లేకపోవడం ఏమిటని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీంతో బాలయ్యకు నిజంగానే సమాచారం ఇవ్వలేదా.. కావాలనే బాలయ్యను పక్కన పెట్టారా అనే పలు అనుమానాలు నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీకి సేవలు చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులను ఇండస్ట్రీ వ్యవహారాలలో పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.