పాత సీసాలో కొత్త సారాయి వొంపుతాడా!

Sun Dec 08 2019 18:31:09 GMT+0530 (IST)

Balakrishna Role in Ruler Movie

ద్విపాత్రాభినయం మన వెటరన్ స్టార్లకు కొత్తేమీ కాదు. ఒక దెబ్బ పడి బుర్ర బరువెక్కాక ఫ్లాష్ బ్యాక్ మర్చిపోవడం కొత్త లైఫ్ లో ఏదో కొత్త పాత్రతో పరిచయం కావడం అన్న ఫార్ములా ఏనాటి నుంచో ఉన్నదే. ఒకే హీరోని రెండు మూడు వెరైటీ గెటప్పులతో చూపించేందుకు ఆస్కారం ఉండడం వల్ల ఈ ఫార్ములానే మన దర్శకులు నమ్ముకుంటున్నారు. అయితే ఈ ఫక్తు కమర్షియల్ ఫార్ములాని బోయపాటి గత చిత్రాల్లో ఎప్పుడో ఉపయోగించేశారు. ఆయనొక్కడేనా అంటే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరికీ ఈ తరహా సినిమాలు తీయడం కొట్టిన పిండి.అందుకే మన సీనియర్ డైరెక్టర్లు తీసేవన్నీ రొటీన్ స్టఫ్ తో పరమ రొటీన్ గానే కనిపిస్తున్నాయ్. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కించనున్న సినిమా ఎలా ఉండబోతోంది? అంటూ నందమూరి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. సింహా- లెజెండ్ తో పోలిస్తే ఈసారి బోయపాటి తన హీరోని ఇంకెంత కొత్తగా చూపిస్తారో  చూడాలన్న ఉత్సాహం కనిపిస్తోంది. బాలయ్య- కే.ఎస్.రవికుమార్ కాంబినేషన్ మూవీ `రూలర్` పరమ రొటీన్ అంటూ.. ఇప్పటికే బోలెడన్ని విమర్శలు ఉన్న నేపథ్యంలో బోయపాటికి తాజా చిత్రం సవాల్ గా మారింది.

తాజాగా బోయపాటి ఎంచుకున్న కథ కూడా లీకైపోయింది. ఎన్.బీ.కే 106 చిత్రంలో బాలయ్య రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారట. అందులో ఒకటి రైతు పాత్ర అయితే మరొకటి బిలియనీర్ రోల్. రైతు గా విలేజ్ లో మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్ గా కనిపిస్తూనే... వేరొక పాత్రలో కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా రేంజు బిలియనీర్ గా కనిపిస్తాడట. మాల్యా తరహాలోనే ప్లేబోయ్ పాత్ర ఇదని చెబుతున్నారు. క్షణం తీరిక లేకుండా విదేశాలకు తిరిగేస్తూ సగం లైఫ్ విమానాల్లోనే గడిపేసే కార్పొరెట్ బాబుగా.. తలబిరుసు ఉన్నవాడిగా ప్లే బోయ్ గా ఆ పాత్రలో వేరియేషన్స్ ని చూపిస్తాడట. మొత్తానికి విజువల్ రిచ్ పారిన్ లొకేషన్లతో పాటు పంట పొలాలతో పచ్చని విలేజ్ ని కూడా చూపించబోతున్నారని అర్థమవుతోంది. అయితే ఈ తరహా కథాంశాలు తెలుగు తెరకు కొత్తేనా? కనీసం బాలయ్య ఇందులో కొత్తగా చేసేదేం ఉంటుంది? అంటూ గుసగుస మొదలైపోయింది అప్పుడే.