Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి.. బాల‌య్య రియాక్ష‌న్ ఇదే

By:  Tupaki Desk   |   17 May 2022 2:30 AM GMT
ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి.. బాల‌య్య రియాక్ష‌న్ ఇదే
X
తెలుగు ప్రజలు ఆరాధ్య ధైవంగా భావించే విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు, ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్‌) శత జయంతి వేడుకలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు అయిన‌.. ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఆ పార్టీ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అబిమానుల మ‌ధ్య ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని ఏడాది పాటు నిర్వ‌హించేలా ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకుంది. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం కూడా ముందుకు వ‌చ్చింది.

ఎన్టీఆర్ శ‌త జయంతి వేడుక‌ల‌ను రాష్ట్రాలు, దేశం, అంత‌ర్జాతీయంగా తెలుగు వారు ఉన్న ప్ర‌తిచోటా.. ఘనంగా నిర్వహించాలని ఆయన కుమారుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, దీనికి ప్ర‌తి తెలుగువారు.. స‌హ‌క‌రించాల‌ని.. అన్న‌గారి ఆశ‌యాల‌ను ఆలంబ‌న‌గా తీసుకుని అభివృద్ధి చెందాల‌ని బాల‌య్య సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక సందేశం ఇచ్చారు. ``తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి`` అని ఆయన సూచించారు.

ఈ నెల 28న ఏపీలోని ఉమ్మ‌డి కృష్నా జిల్లాలో ఉన్న అన్న‌గారి జ‌న్మ‌స్థ‌లం నిమ్మకూరులో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను తానే స్వ‌యంగా ప్రారంభిస్తాన‌ని బాల‌య్య పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం గుంటూరు, తెనాలిలోనూ ఉత్సవాల్లో పాల్గొంటాన‌ని వెల్ల‌డించారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి సంబరాలను నిర్వహించేలా బాలకృష్ణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలంటే 10 కోట్ల మంది తెలుగు ప్రజల ఇంటి పండుగ అని బాలకృష్ణ అన్నారు. ఈ ఉత్సవాల్లో అభిమానులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్... గురించి.. ఆస‌క్తిక‌ర విష‌యాలు!

నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ `తారక రాముడు` అయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. అంటే.. ఎన్టీఆర్ అస‌లు పేరు `తార‌క రాముడు` రికార్డుల్లోనూ ఇదే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది.

పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నారు. మీసాలతోటే నటించడం వలన అతనుకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు.

1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన `పాపం` వంటి ఎన్నో నాటకాలు ఆడారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయ‌న‌ బహుమతి కూడా వచ్చింది.