గుండుతో సింహా.. షాక్ తిన్న ఫ్యాన్స్

Mon Jan 20 2020 10:03:32 GMT+0530 (IST)

Balakrishna Makeover For #NBK106

నటసింహా నందమూరి బాలకృష్ణ కెరీర్ లో లుక్ పరంగా ప్రయోగాలు చేసినా.. గుండు గీయించుకున్న సందర్భాలేవీ లేవు. అప్పట్లో సుల్తాన్ చిత్రంలో డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించాడు కానీ బాల్డ్ హెడ్ కి సంబంధించిన ట్రీట్ ఏదీ లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఏజ్డ్ పర్సన్ గానో లేక యంగ్ కిలాడీ బోయ్ గానో కనిపించారు  కానీ మరీ ఇలాంటి ప్రయోగం అయితే లేదు. సడెన్ గా ఆయన గుండుతో ప్రత్యక్షమై అభిమానులు నోరెళ్లబెట్టేలా చేశారు.ఇంతకీ ఈ కొత్త లుక్ దేనికోసం..? అంటే వివరాల్లోకి వెళ్లాలి. బాలయ్యకు దర్శకుల హీరో అన్న పేరుంది. స్క్రిప్టు ఒకసారి లాక్  అయిందంటే ఆయన దర్శకుడి మాటే వింటారు. సెట్ లో దర్శకులు చెప్పినట్లే చేస్తారు. చిన్న చిన్న  సలహాలు సైతం బాలయ్య దర్శకులకు ఇవ్వరని ఆయనతో పనిచేసిన దర్శకులంతా చెబుతుంటారు. బాలయ్య తో పనిచేసినంత సౌకర్యం ఇంకే హీరో దగ్గర కుదరదని దర్శకులు చెప్పడం చాలాసార్లు విన్నాం. ఇక పాత్రకు అవసరమైన ఆహార్యం విషయంలో బాలయ్య  అంతే జాగ్రత్త తీసుకుంటారు. దర్శకులు పెట్టిన కండీషన్స్ ని తూ.చ తప్పకుండా పాటించి డైరెక్టర్లకు కావాల్సిన మేకోవర్ లో కనిపిస్తారు. అందుకే ఈ ప్రయోగం చేస్తున్నారా? అందుకేనా ఈ బాల్డ్ లుక్? అంటే.. అవుననే భావిస్తున్నారు.

ఇటీవలే రూలర్ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య ఐరన్ మ్యాన్ లుక్ లో ఆకట్టుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలయ్య ఎంతగా శ్రమించారో తెలిసిందే. డిఫరెంట్ గెటప్ ల కోసం అవసరాన్ని బట్టి బరువు పెరగడం.. తగ్గడం  ఇలా పాత్రల కోసం ఛేంజోవర్ చూపిస్తుంటారు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్న కొత్త చిత్రం కోసం బాలయ్య న్యూ లక్ ట్రై చేస్తున్నారు. నున్నగా గుండు గీయించుకుని ఈసారి పూర్తి ప్రయోగాత్మకంగా తెరపై కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం బాలయ్య  కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

తెలుపు  ఖద్దరు  లో నెరిసిన గడ్డం...నల్లటి మీసాలు.. అలాగే నున్నని గుండుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఏపీలో అసెంబ్లీ సమాశాలు నేపథ్యంలో బాలయ్య ఇలా వైంట్ అండ్ వైట్ తో సమావేశాలకు హాజరవ్వడానికి రెడీ అవుతున్నారట. ఇక నున్నటి  గుండు అయితే కచ్చితంగా కొత్త సినిమా కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇది బాలయ్య కు 106వ చిత్రం  కావడం. బోయపాటి కోసం బాలయ్య ఇప్పటికే 15 కేజీల బరువు తగ్గారన్న టాక్ కూడా వినిపిస్తోంది.