ట్రైలర్ టాక్ : బట్టతల బాలా కష్టాన్ని ఏమని వర్ణించాలి?

Thu Oct 10 2019 15:04:07 GMT+0530 (IST)

Bala Trailer Talk

సంఘంలో మనుగడ సాగించడం అంత సులువా? మనిషి ప్రపంచంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అన్నిటినీ ఎదురించి జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే సవాళ్లెన్నిటినో ఎదురొడ్డి పోరాడాలి. పైగా లోపాలు ఉన్న యువత ఈ లోకాన్ని ఎదుర్కోవాలంటే గిల్టీ నుంచి ముందుగా బయటపడాలి. అన్నీ ఉన్నా ఏదో ఒక లోపం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో లోపం. అలా దేవుడు ఎవరికి ఏ లోపం పెడతాడో ఎవరూ చెప్పలేం. ఇదిగో ఈ కుర్రాడికి మాత్రం బట్టతల అనేది లోపం. దానివల్ల ఎంత నమోషీని ఎదుర్కొన్నాడో ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. బట్టతలతో తిరుపతికి వెళితే టేకిటీజీ పాలసీ అన్న చందంగా ఉంది బాలా సన్నివేశం. బట్టతల కుర్రాడికి పిల్లను వెతకాలంటే ఏ ఫ్యామిలీకి అయినా ఎన్ని తిప్పలు ఎదురవుతాయో విడిగా పాఠం చెప్పాలా?  నా టోపీ నా ఇష్టం! అంటూ బట్టతలను కవర్ చేయడం అన్నిసార్లు కుదరదు. బట్ట గుండు బయటికి కనిపించే వ్యవహారం. ఏదో ఒకసారి టోపీ తీయాల్సిందే. పాపం పిల్లను వెతుక్కునే ఈ కుర్రాడి అలానే బోలెడన్ని పాట్లు పడాల్సొచ్చింది. అసలు ఆ టోపీ ఎందుకు అడ్డు.. చెమట పట్టదా?! అంటూ ఠపీమని తొలగించింది ఆ నల్లమ్మాయ్!  దానికి అతడు ఎంత షేమ్ ఫీలయ్యాడో కదా! ఒకటా రెండా ఇలాంటి మెరుపులెన్నో ఆయుష్మాన్ ఖురానా నటించిన `బాలా` ట్రైలర్ లో తళుక్కుమన్నాయి. #బాలా పేరుతో ప్రస్తుతం ఈ ట్రైలర్ గూగుల్ లో ట్రెండ్ అవుతోంది అంటే అందులో అంత మ్యాటర్ ఉందనే అర్థం. విక్కీడోనర్ - బాదాయీ హో- అంధాదున్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆయుష్మాన్ మరో ప్రామిస్సింగ్ సినిమాలో నటించాడని ట్రైలర్ చెబుతోంది. కంటెంట్ బేస్డ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ అతడు మరో హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాన్సెప్ట్ సెలక్షన్ లో ఆయుష్మాన్ నవతరం హీరోలకు ఆదర్శం అనే చెప్పాలి. అతడు చేస్తున్న తాజా ప్రయోగం `బాలా`... బట్టతల అన్న టాస్క్ ని ఎంచుకుని ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కడుపుబ్బా నవ్వుకునే సీన్లతో చక్కని సందేశాన్ని  నేటి తరానికి అందించబోతున్నారని ట్రైలర్ చెబుతోంది.

అకాలంగా వచ్చే బట్టతల సమస్యను ఎదుర్కొంటున్న లక్నోకు చెందిన గౌరవ్ రావత్ అలియాస్ బాలా అనే వ్యక్తి పాత్రలో ఆయుష్మాన్ కనిపించనున్నారు. బట్ట తల నుంచి బయటపడేందుకు అతడు చేయని ప్రయత్నమే లేదు. అయితే ప్రయత్నించిన ప్రతిదీ ఫెయిల్యూరే. ఏదోలా మ్యానేజ్ చేసేసినా అది కొంతకాలమే. పెట్టుడు హెయిర్ కట్ పర్మినెంట్ కాదనే సందేశం ఈ ట్రైలర్ లో ఉంది. స్కిన్ వైటనింగ్ ఉత్పత్తులను అమ్మే కుర్రాడిగా అతడు కనిపిస్తున్నాడు. అమ్మాయి కలర్ .. తెల్ల రంగు అంటూ అతడు క్లాస్ తీస్కుంటుంటే.. లక్నో బ్లాక్ గాళ్ భూమి పెడ్నేకర్ మనస్తాపం చెంది ఎందుకు టోపీ ధరించావ్? అని బాలాను అవమానించిన సీన్ హైలైట్ ఈ ట్రైలర్ లో. పెళ్లికి బట్టతల ఎలా అడ్డంకి అన్నదే హైలైట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో విక్కీ డోనర్ ఫేం యామీ గౌతమ్ లక్నో కి చెందిన సూపర్ మోడల్ పాత్రలో నటిస్తోంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకుడు. దినేష్ విజన్- కౌశిక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సౌరభ్ శుక్లా- జావేద్ జాఫ్రీ- మరియు సీమా పహ్వా సహాయక పాత్రలు పోషిస్తున్నారు. #బాలా ట్రైలర్ ప్రస్తుతం గూగుల్ లో ట్రెండ్ అవుతోంది.