Begin typing your search above and press return to search.

‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో మోక్షజ్ఞ లాంచింగ్

By:  Tupaki Desk   |   11 Jun 2021 3:34 AM GMT
‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో మోక్షజ్ఞ లాంచింగ్
X
ఎప్పుడో 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని చెప్పాడు నందమూరి బాలకృష్ణ. కానీ ఇప్పుడు 2021లో ఉన్నాం. ఇప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఊసే లేదు. గత ఏడాది ఇదే సమయానికి మోక్షజ్ఞ లుక్స్ చూస్తే అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశాలు ఎంతమాత్రం లేవేమో అనిపించింది. హీరో అయ్యే దిశగా మోక్షు ఎలాంటి ప్రిపరేషన్లో లేడనిపించింది ఆ లుక్ చూస్తే. ఐతే తన షష్ఠిపూర్తి సందర్భంగా మీడియా ఇంటర్వ్యూల్లో బాలయ్య మాట్లాడుతూ.. మోక్షజ్ఞ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడనే అన్నారు. కానీ తర్వాత ఏ ఊసూ లేదు. ఐతే ఇప్పుడు బాలయ్య 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. మరోసారి తన కొడుకు ఎంట్రీ గురించి పాజిటివ్‌గానే మాట్లాడాడు బాలయ్య.

మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ గురించి బాలయ్య ఈసారి ఆసక్తికర కబురు చెప్పారు. ఎప్పట్నుంచో నానుతున్న ‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్నట్లు బాలయ్య వెల్లడించడం విశేషం. అంతే కాదు.. ఈ సినిమాను తనే డైరెక్ట్ చేయనున్నట్లు కూడా చెప్పాడు. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది మాత్రం బాలయ్య వెల్లడించలేదు. ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ను ‘ఆదిత్య 999’ పేరుతో తెరకెక్కించడానికి చాలా ఏళ్ల కిందటే ప్రయత్నాలు జరిగాయి. ఈ సినిమాకు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్టు కూడా పూర్తి చేశారు. దానికి స్టోరీ బోర్డ్ సైతం రెడీ చేశారు. ఐతే ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇప్పుడు సింగీతం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే స్థితిలో లేకపోవచ్చు. బహుశా స్క్రిప్టు, స్టోరీ బోర్డ్ రెడీగా ఉంది కాబట్టి తనే డైరెక్ట్ చేద్దామని బాలయ్య అనుకుంటున్నాడేమో. ఇందులో బాలయ్య, మోక్షజ్ఞ తండ్రీ కొడుకులుగా కనిపించే అవకాశముంది.