Begin typing your search above and press return to search.

ఇది ఘోర అవమానమే

By:  Tupaki Desk   |   15 Oct 2021 1:30 PM GMT
ఇది ఘోర అవమానమే
X
మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ అనూహ్యంగా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాని ఆయన ప్యానల్‌ లో కీలక పదవి ఎగ్జిక్యూటివ్‌ వైస్ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేసిన బాబు మోహన్‌ మాత్రం ఓడిపోయాడు. ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌ కు చెందిన శ్రీకాంత్ ఆ పదవికి పోటీ పడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన గెలుపుపై బాబు మోహన్‌ చాలా ధీమాగా కనిపించాడు. కాని ఆయన ఓటమి అందరికి షాక్ ఇచ్చింది. రాజకీయ నాయకుడిగా హేమా హేమీలతో పోటీ పడి మరీ గెలిచిన బాబు మోహన్ ఈసారి ఈ చిన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోవడం విడ్డూరంగా ఉందంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

బాబు మోహన్ వంటి వ్యక్తి ఇలాంటి పదవికి పోటీ చేయడం తప్పుడు నిర్ణయం అంటున్నారు... ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి అవ్వడం దారుణమైన అవమానమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన టైమ్ ఏం బాగోలేదు. ఆయన సినిమాల్లో నటించాలని కోరుకున్నా కూడా ఆవకాశాలు దక్కడం లేదు. మరో వైపు రాజకీయంగా కూడా టైమ్‌ బాగోలేదు. ఇలాంటి సమయంలో మా ఎన్నికల్లో పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మళ్లీ మా లో యాక్టివ్‌ అవ్వడం ద్వారా నటుడిగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కాని బాబు మోహన్ కు మా ఎన్నికలు మరింతగా డ్యామేజీ చేశాయనే టాక్ వినిపిస్తుంది.

ప్రకాష్‌ రాజ్ ను స్థానికేతరుడు అంటూ వ్యాఖ్యలు చేయకుండా.. తెలుగు వారిని గెలిపించండి.. తెలుగు ప్యానల్‌ ను గెలిపించండి అంటూ బాబు మోహన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మంచు విష్ణు గెలుపుకు ఆయన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి అనడంలో సందేహం లేదు. అలాంటి బాబు మోహన్‌ ఓడి పోవడం అంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది. బాబు మోహన్‌ పై గెలుపొందిన శ్రీకాంత్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ పదవి ఖాళీగానే ఉంది. బాబు మోహన్‌ ఎన్నికల ఫలితాల తర్వాత బయట కనిపించలేదు.