మెగా హీరోలతో చేశాను .. మెగా హిట్లు కొట్టాను!

Mon Jun 27 2022 14:00:49 GMT+0530 (IST)

BVSN prasad speach on ranga ranga vaibhavanga teaser event

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఒక్కో ప్రాజెక్టును లైన్లో పెడుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగ రంగ వైభవంగా' రూపొందింది. గిరిశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. కొంత సేపటి క్రితం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడారు."మెగా ఫ్యామిలీలోని అందరితోనూ నేను సినిమాలు చేశాను. అలాగే వైష్ణవ్ తేజ్ తోను ఈ సినిమా చేశాను. అన్నీ హిట్ అయినట్టుగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాను కూడా మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. గతంలో చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర'కి ఆయన ఒక నిర్మాత. ఇక పవన్ కల్యాణ్ హీరోగా ఆయన నిర్మించిన 'అత్తారింటికి దారేది' .. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే.

ఇక ఈ సినిమా దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ .. "ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ కి మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు సపోర్ట్ చేసున్నా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో ఒక హీరోను కలిసి కథ చెప్పడం చాలా కష్టం.  

కానీ వైష్ణవ్ తేజ్  నేను చెప్పిన కథ వినేసి వెంటనే ఓకే చెప్పారు .. నేను అక్కడి నుంచి వచ్చేస్తుంటే నా చేతిలో ఒక బాక్స్  పెట్టారు. ఇంటికి వెళ్లి  ఓపెన్ చేస్తే అందులో చాక్ లెట్స్ ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి మా ఇంటికి వచ్చిన ఫస్టు గిఫ్ట్ అది.

మా ఇంట్లో మేమంతా మెగా స్టార్ అభిమానులం .. అందువలన ఆ రోజంతా మా ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైష్ణవ్ లుక్ అదిరిపోయింది  అంటూ అంతా చెప్పారు. ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు .. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.  

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ఎనర్జీనే ఈ సినిమా. ఇందులో కథానాయిక పేరు రాధ. ఆ పాత్ర కోసం చాలామందిని అనుకున్నాము. కేతిక కళ్లు చూడగానే నాకు రాధ దొరికేసిందని  అనుకున్నాను. ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.