నానితో కాదు.. కొత్త హీరోతో

Wed Jul 11 2018 12:08:23 GMT+0530 (IST)

నటుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. దర్శకుడిగానూ అంతే మంచి ఫీడ్ బ్యాక్ సంపాదించాడు అవసరాల శ్రీనివాస్. తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తోనే తనదైన ముద్ర వేసిన అవసరాల.. రెండో సినిమా ‘జ్యో అచ్యుతానంద’తో ఇంకొన్ని మెట్లు ఎక్కాడు. ఈ తరం జంధ్యాలగా అతడికి పేరు రావడం విశేషం. అవసరాల నుంచి వచ్చే మూడో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే తొలి సినిమా తర్వాత ఎలా అయితే బాగా గ్యాప్ తీసుకున్నాడో.. రెండో సినిమా తర్వాత కూడా అలాగే చేస్తున్నాడు అవసరాల. ‘జ్యో అచ్యుతానంద’ వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా మూడో సినిమా సంగతి తేల్చలేదు. నిజానికి ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారమైతే అవసరాల మూడో సినిమా.. నానితో ఈపాటికే మొదలవ్వాల్సింది.కానీ ‘జెంటిల్ మన్’ సినిమా చూశాక నానితో అంతకుముందు అనుకున్న కథ వర్కవుట్ కాదనిపించిందని.. వేరే కథ కోసం చూస్తున్నానని ఆ మధ్య అన్నాడు అవసరాల. కానీ నానితో మరో కథ ఏదీ సెట్టవ్వలేదట. మంచి కథ తడితే అప్పుడే సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈలోపు ఒక కొత్త హీరోతో అవసరాల సినిమా చేయబోతున్నట్లు సమాచారం. బహుశా అది నానితో ఇంతకుముందు అనుకున్న కథే కావచ్చేమో. అవసరాల తొలి రెండు సినిమాల్ని నిర్మించిన సాయి కొర్రపాటే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాడట. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ఒక కొత్త హీరో కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. కథకు సెట్టయ్యే హీరో దొరకగానే సినిమా మొదలవుతుందట. ప్రస్తుతం సాయి కొర్రపాటి నందమూరి బాలకృష్ణతో ‘యన్.టి.ఆర్’ నిర్మిస్తున్నారు. ఈ గురువారం ఆయన కొత్త సినిమా ‘విజేత’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.