రజనీ ఫోటో వాడిన ఆస్ట్రేలియా పోలీసులు.. ట్వీట్ వైరల్

Mon Feb 18 2019 20:00:02 GMT+0530 (IST)

Australia Police Use Rajinikanth Meme To Talk About Drunk Driving

సూపర్ స్టార్ రజనీకాంత్ పాపులారిటీ గురించి.. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  జపాన్.. మలేషియా లాంటి దేశాల్లో ఆయనకు భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ సంగతేమో గానీ ఆస్ట్రేలియా లోని డెర్బీ పోలీసులు కూడా రీసెంట్ గా ఒక విషయంలో రజనీకాంత్ మద్దతు తీసుకున్నారు.మనకు హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు మందుబాబుల మూతి దగ్గర బ్రెత్ ఎనలైజర్ పెట్టి ఉఫ్ మని ఊదమంటారు కదా.. సరిగ్గా అలాగే ఆస్ట్రేలియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ నిర్వహించారట. అందులో ఒక ప్రబుద్దుడికి బీఎసీ(బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్) కౌంట్ ఏకంగా 0.341 వచ్చిందట. దీంతో పోలీసులు ఖంగు తిన్నారు. వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయం తెలుపుతూ ఆ టెస్ట్ స్లిప్ తో పాటు రజనీ మీమ్ ను పోస్ట్ చేశారు.  '2.0' సినిమాలో ఫిఫ్త్ ఎలిమెంట్ గురించి వివరిస్తూ రజని 'దిస్ ఈజ్ బియాండ్ సైన్స్' అనే కిరాక్ డైలాగ్ చెప్తాడు కదా.  సరిగ్గా ఆ ఫోటో అన్నమాట.

సదరు తాగుబోతు మహారాజు గురించి వివరిస్తూ "ఆ పురుషుడి ఆల్కహాల్ కౌంట్ 0.341 వచ్చింది.  ఆ మత్తులో డ్రైవింగ్ చేయడం అంటే ఓ మనిషి కోమాలోనో లేక సర్జరీ చేసే సమయంలో ఇచ్చే అనస్తీషియా మత్తులోనో ఉన్నప్పుడు చేసే డ్రైవింగ్ లాంటిది" అంటూ ప్రజలకు తెలియపరిచారు.  అలాంటి మత్తులో ఎంచక్కా డ్రైవింగ్ చేస్తున్నాడంటే బియాండ్ సైన్సే కదా.   ఈ ట్వీట్ లో రజనీ ఫోటో ఉండడంతో వెంటనే వైరల్ అయింది.   ఆస్ట్రేలియన్ పోలీసులు తలైవర్ ఫోటో వాడడం చూసిన ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు.  ఏమైనా రజనీ స్టార్డమ్ వేరే లెవెల్ అని మురిసిపోతున్నారు.