సినీ ప్రియులకు పంద్రాగస్టు కానుకలివే..

Tue Aug 13 2019 22:45:56 GMT+0530 (IST)

August 15th Gifts for His Fans in telugu Film Industry

పెద్ద పండగేదైనా వస్తే.. మేకింగ్ దశలో ఉన్న పెద్ద సినిమాల నుంచి ప్రేక్షకులకు ఏదో ఒక కానుకలు ఇవ్వడం మామూలే. అలా చాలా స్పెషల్ గా  పరిగణించే పండుగ ల్లో స్వాతంత్ర్య దినోత్సవం కూడా ఒకటి. ఈసారి పండక్కి చాలా కానుకలే సిద్ధమైనట్లున్నాయి. అందులో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది ‘సైరా’ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోనే. ఎప్పుడో ఏడాది కిందట చిరు పుట్టిన రోజు సందర్భంగా ఒక టీజర్ వదిలిపెట్టి ఊరుకుంది చిత్ర బృందం. ఆ తర్వాత ఏవో పోస్టర్లు కొన్ని రిలీజ్ చేశారు కానీ.. అవంత కిక్కివ్వలేదు. ఐతే ఇప్పుడు విడుదలకు నెలన్నర మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచే క్రమంలో సినిమా నుంచి ఒక మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నారు. అది చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. సినిమా స్థాయిని చూపించేలా దాన్ని తీర్చిదిద్దారట.ఇక పంద్రాగస్టున అందబోయే మరో కానుక.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ ప్రకటన. మామూలుగా త్రివిక్రమ్ సినిమా అంటే టైటిల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటి గురించి ముందు నుంచే రకరకాల ప్రచారాలు జరుగుతాయి. లీక్స్ వస్తాయి. బన్నీతో మాటల మాంత్రికుడు చేస్తున్న సినిమా గురించి అలాంటి రూమర్లే వినిపించాయి. నేను నాన్న.. అలకనంద.. అని గతంలో వైకుంఠపురంలో అంటూ తాజాగా టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.. మరి త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి మ్యాజికల్ టైటిల్ తో వస్తాడో చూడాలి. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజీ మూవీ ‘వాల్మీకి’ నుంచి టీజర్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. పంద్రాగస్టుకే ఇది రిలీజవుతుందని అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇక రాజమౌళి తీస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేస్తారంటూ ఒక ప్రచారం జరిగింది కానీ.. అదేమీ ఉండదని సమాచారం. ‘సాహో’ టీం కూడా ప్రేక్షకుల కోసం ఏదో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇవే ముచ్చట్లు.