Begin typing your search above and press return to search.

భారీ బడ్జెట్ సరే.. భారీ లాభాలు వస్తే తిరిగి ఇచ్చేస్తారా?

By:  Tupaki Desk   |   25 Aug 2019 4:30 AM GMT
భారీ బడ్జెట్ సరే.. భారీ లాభాలు వస్తే తిరిగి ఇచ్చేస్తారా?
X
వినేటోడు ఉంటే చెప్పేటోడు చెలరేగిపోతారని ఊరికే అనరేమో? భారీ బడ్జెట్ సినిమా పేరుతో తీసే సినిమాలు అంతిమంగా ఆ భారాన్ని ప్రేక్షకుల మీదకు బదిలీ చేయటంపై పలువురు మండిపడుతున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. క్రేజీ సినిమాల పేరుతో సొమ్ము చేసుకుంటున్న తీరును తప్పు పడుతున్నారు. ప్రభుత్వాలు సైతం ప్రజల పక్షాన నిలవాల్సింది పోయి.. నిర్మాతలు కోరినంతనే ఓకే చెప్పేయటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా సినిమా విడుదలైన రెండు వారాల పాటు టికెట్ ధరల్ని రెట్టింపు చేయాలన్న వినతిని ప్రొడ్యూసర్లు కోరటం.. అందుకు ప్రభుత్వాలు ఓకే అనటం చూస్తే.. ప్రేక్షకుల గురించి ఎవరికి పట్టదా? అన్న సందేహం రాక మానదు. ఒక సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించటం అన్నది సదరు నిర్మాత ఇష్టం. ఇక సినిమా క్రేజీ ప్రాజెక్టు అయితే.. దాన్ని తెలుగుతో పాటు.. తమిళం.. కన్నడం.. హిందీ.. ఇలా భాషల్లో కావాలంటే అన్ని భాషల్లో డబ్బింగ్ చేయటం తెలిసిందే.

ఎక్కడిదాకానో ఎందుకు బాహుబలి సినిమా సంగతే చూద్దాం. ఈ సినిమాను భారతీయ భాషల్లోనే కాదు.. చివరకు చైనీస్.. జపనీస్ భాషల్లోనూ తీసి వదిలారు. సొమ్ము చేసుకున్నారు. ఒక మంచి సినిమా తీసినప్పుడు భాషలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారు.. దేశాల వారు ఆదరిస్తారు. అలాంటప్పుడు ఆ సినిమా మీద పెట్టిన పెట్టుబడి వందల రెట్లు వెనక్కి రావటం ఖాయం.

భారీ బడ్జెట్ తో తీశాం కాబట్టి.. పెట్టిన పెట్టుబడిని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకోవటానికి వీలుగా టికెట్ల ధరల్ని డబుల్ చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించే నిర్మాతల తీరును చూసినప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు వేయాలనిపిస్తుంది. లాభాలు తర్వాత.. పెట్టిన పెట్టుబడి తిరిగి తెచ్చుకునే ప్రయత్నం అని అందంగా చెప్పే నిర్మాతలు.. మరి తాము భారీగా లాభాల్ని మూటగట్టుకున్నప్పుడు.. తాము వసూలు చేసిన డబుల్ ఛార్జిను కాస్త మినహాయించి ప్రేక్షకులకు వెనక్కి ఇస్తారా? అన్నది ప్రశ్న.

ఒక సినిమాకు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారంటే.. దాన్ని వెనక్కి తెచ్చుకోవటానికి.. తమ పెట్టుబడి సేఫ్ గా ఉండేలా వ్యూహాల్ని ముందే సిద్ధం చేసుకుంటారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. మీరుండే ఊరిలో సూపర్ మార్కెట్ ఉంటుంది కదా. దాన్ని మన రెగ్యులర్ సినిమా అనుకుందాం. భారీ ఎత్తు.. మెగా సూపర్ మార్కెట్ అదేనండి హైపర్ మార్కెట్లు కొన్నిచోట్ల ఓపెన్ అవుతాయి. అంటే.. సాధారణంగా ఉండే సూపర్ మార్కెట్లకు పాతిక రెట్లు.. యాభైరెట్లు..కొన్నిసార్లు వంద రెట్లు ఎక్కువ సైజులో ఏర్పాటు చేస్తుంటారు.

సూపర్ మార్కెట్ లో దొరికే వస్తువుల ధర కంటే ఈ హైపర్ మార్కెట్ లో ధరలు తక్కువగా ఉండటమే కాదు.. భారీ ఆఫర్లు ఇస్తుంటారు. ఎందుకని? భారీ బడ్జెట్ తో ఏర్పాటు చేసిన మాల్ కావటంతో.. ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేస్తారు. తక్కువ మార్జిన్ పెట్టుకొని.. వీలైనంత ఎక్కువమంది తమ వద్దకు వచ్చేలా చేస్తారు. సూపర్ మార్కెట్ కు వర్తించే సూత్రం సినిమాలకు ఎందుకు వర్తించదు?

మామూలు సినిమా ఒకట్రెండు భాషలకే పరిమితం. దాని కలెక్షన్లు కూడా అంతంతకే. చాలా బాగుందంటే తప్పించి భారీ ఎత్తున లాభాల్ని మూటగట్టుకునే అవకాశం ఉండదు. దీనికి తోడు ఓపెనింగ్స్ తక్కువగా ఉండి.. సినిమాకు మంచి టాక్ వస్తే ప్రేక్షకులురావటం మొదలెడతారు. శాటిలైట్ రైట్స్ కూడా క్రేజీ ధర రాదు. ఒకవేళ రిలీజ్ వేళలో శాటిలైట్ హక్కుల్ని తమ వద్ద ఉంచేసుకొని.. సినిమా హిట్ అయ్యాక అమ్మితే ఎక్కువ ధర పలుకుతుంది. కానీ.. రిస్క్ నేపథ్యంలో ఏ నిర్మాత కూడా తమ సినిమా శాటిలైట్ హక్కుల్ని విడుదలకు ముందే అమ్మేసుకుంటారు. కానీ.. క్రేజీ సినిమాలకు ఇందుకు భిన్నమైన అవకాశాలు ఉంటాయి.

భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా కావటంతో మీడియాలో మామూలు సినిమా కంటే వంద రెట్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. సదరు సినిమాకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు ఎక్కువగా ఇస్తుంటారు. అంతేనా.. భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లు.. స్క్రీన్స్ లోనూ ఈ సినిమానే ప్రదర్శిస్తారు. అంటే.. విడుదలైన రెండు మూడు రోజుల వరకూ ఈ సినిమా తప్పించి మరే సినిమా చూసే ఆప్షన్ లేకుండా చేస్తారు. దీంతో భారీ ఓపెనింగ్స్ సాధ్యమవుతాయి. అంతేనా.. శాటిలైట్ హక్కుల ధరలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటికిమించి సినిమా కానీ సూపర్ హిట్ అయ్యిందా? ప్రపంచంలోని చాలా భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేసేస్తారు.

ఈ లెక్కన సాధారణ సినిమాకు ఉండే రిస్క్ తో పోలిస్తే.. భారీ బడ్జెట్ సినిమాలకు ఆ రిస్క్ తక్కువ. అలాంటప్పుడు.. టికెట్ల ధరల్ని డబుల్ చేయటంలో న్యాయముందా? అన్నది క్వశ్చన్. కేవలం సినిమాను ఇష్టపడటం.. అభిమానించటం.. ఆరాధించటం లాంటి బలహీనతలు ఉన్న సగటు ప్రేక్షకుడ్ని దోచుకోవటం మినహా.. టికెట్ల పెంపు ఆలోచనలో ఇంకేమైనా ఉందా? నిజం చెప్పాలంటే టికెట్ల ధరల పెంపు కారణంగా తెలుగు సినిమాను చంపేయటమే.

ఎందుకంటే.. క్రేజీ సినిమాల బడ్జెట్ భారీగా ఉండొచ్చు కానీ ప్రేక్షకుడి బడ్జెట్ మాత్రం పరిమితంగా ఉంటుంది. ఒక పెద్ద సినిమాను డబుల్ ధర పెట్టి టికెట్ కొనుగోలు చేసినప్పుడు.. అతడి బడ్జెట్ రూ.500 కాస్తా వెయ్యి అవుతుంది. ఇలాంటప్పుడు తాను అదనంగా పెట్టిన రూ.500 ఖర్చుకు తగ్గట్లు కోత పెట్టుకునేందుకు తాను చూడాల్సిన సినిమాల్ని తగ్గించేసుకుంటారు. అలాంటప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలతో పాటు.. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాలకు దెబ్బ పడటం ఖాయం. మరీ.. విషయం మీద చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. మేధావులు నోరెందుకు విప్పరు?