Begin typing your search above and press return to search.

ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)

By:  Tupaki Desk   |   7 May 2021 4:30 AM GMT
ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
X
పాట మనసుకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది .. ఉల్లాసాన్ని అందిస్తుంది .. ఒంటరితనంలోనూ తోడుగా నిలిచి ఓదార్పునిస్తుంది. అందుకే పాటను ఇష్టపడనివారు ఉండరు .. పాటల తోటలో విహరించనివారుండరు. ఆనందంతో పొంగినా .. ఆవేదనతో కుంగినా పలకరించేది పాటనే. చెలి చెంతనున్నా .. విరహాగ్నిలో తోసేసి దూరమైనా ఆదరించేది పాటనే. మనసుకు పాట పందిరిలాంటిది. ఆ నీడలో సేదతీరాలనే ప్రతి మనసు కోరుకుంటుంది .. అనుభూతుల లోకంలోకి చేరిపోవాలనే ప్రతి మనసు ఆశిస్తుంది. అలాంటి మనసు చుట్టూ పాటను ప్రదక్షిణం చేయించిన రచయితగా ఆత్రేయ కనిపిస్తారు.

ఆత్రేయ అసలు పేరు వెంకట నరసింహా చార్యులు .. అయితే గోత్రం పేరైన 'ఆత్రేయ'తోనే రచయితగా అడుగులు వేశారు. 1950 'దీక్ష' సినిమాతో పాటల రచయితగా ఆయన ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఆయన తన పెన్నుకు తిరిగి క్యాప్ పెట్టే అవసరం లేకుండా పోయింది. తెలుగులో ఫలానా కవి ఫలానా తరహా పాటలు బాగా రాస్తారు అని అప్పటి వరకూ చెప్పుకునేవారు. కానీ ఆత్రేయ భావగీతాలు .. విషాద గీతాలు .. శృంగార గీతాలు .. ఇలా ఒకటేమిటి అన్ని పాటలను తన కలం నుంచి పుట్టించారు .. కలకాలం నిలబడే పాటలను పరుగులు తీయించారు.

ఎవరూ పెద్ద రచయితలు లేని సమయంలో రాణించడం తేలికే. కానీ ఆత్రేయ పాటల రచయితగా అడుగుపెట్టినప్పుడు, కవులు ఎంతోమంది బలమైన తమ కలాలతో బరిలో ఉన్నారు. వాళ్ల అక్షర ప్రవాహాన్ని తట్టుకుని నిలబడటమే కష్టం. అయినా ఆత్రేయ తడబడలేదు .. తనకి తెలిసిన తేలికైన పదాలతోనే ఆయన విన్యాసాలను చేశారు. మాటల రచయితగానూ శభాష్ అనిపించుకున్నారు.

ఆత్రేయ రాసిన మాటల్లో వేదాంతం .. ఆ పాటల్లో జీవనసారం దాగున్నాయనే విషయాన్ని ఆ కవులంతా గుర్తించారు. పామరులు మాత్రం హాయిగా ఆ పాటలను పాడుకున్నారు .. పాడుకుంటూ పరవశిస్తూనే ఉన్నారు. ఆత్రేయ పాటలను గురించి చెప్పుకోవడమంటే సముద్రాన్ని దోసిట్లో పట్టుకోవటానికి ప్రయత్నించినట్టే అవుతుంది. నక్షత్రాలను ఒక్కొక్కటిగా ఏరుకోవడానికి చేసే సాహసమే అవుతుంది. మనసుకవిగా మనసులు దోచిన ఆత్రేయ శత జయంతి ఈ రోజు .. ఈ సందర్భంగా ఆ పాటల రారాజును మనసారా స్మరించుకుందాం! ఆ పాటల పంచామృతంతో మనసులను అభిషేకించుకుందాం !!