Begin typing your search above and press return to search.

రజనీ .. చిరూ .. శ్రీదేవి కాంబో అనుకున్న మాట నిజమే!

By:  Tupaki Desk   |   16 Aug 2022 10:31 AM GMT
రజనీ .. చిరూ .. శ్రీదేవి కాంబో అనుకున్న మాట నిజమే!
X
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ లో అశ్వనీ దత్ ఒకరు. దాదాపు 50 ఏళ్లుగా ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన బ్యానర్ నుంచి వచ్చిన 'మహానటి' .. 'జాతిరత్నాలు' .. 'సీతా రామం' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆ తరువాత ప్రాజెక్టులుగా 'అన్నీ మంచి శకునములే' .. ' ప్రాజెక్టు K' సెట్స్ పై ఉన్నాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనేక ఆసక్తికరమైన అంశాలను గురించి ప్రస్తావించారు.

ఈ వేదికపై అశ్వనీదత్ మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ గారితో నేను సినిమా చేయాలనుకున్నప్పుడు, మా బ్యానర్ కి ఆయనే 'వైజయంతి మూవీస్' అనే పేరు పెట్టారు. ఎన్టీఆర్ .. ఏ ఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. ఇలా అప్పట్లో అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన నటులే.

చిరంజీవి గారి డిసిప్లిన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలకృష్ణ గారు .. నాగార్జున గారు ఇద్దరూ కూడా సీనియర్ స్టార్ హీరోల వారసులు. అలాగే వెంకటేశ్ గారు సీనియర్ ప్రొడ్యూసర్ తనయుడు. అయినా ఎంతమాత్రం గర్వం లేకుండా కష్టపడి పనిచేసేవారు. అందుకే అప్పట్లో ఇండస్ట్రీ దేదీప్యమానంగా వెలిగిపోయింది.

వర్మ నాకు రెండు కథలు చెప్పాడు .. ఒకటి 'రంగీలా' అయితే .. రెండవ సినిమా 'గోవిందా గోవింద'. 'రంగీలా' అయితే శ్రీదేవి .. రజనీ .. చిరంజీవి కాంబినేషన్లో చేద్దామని అన్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎందుకూ .. చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి .. రజనీ గారి గహ్హరికి వెళ్లి గెస్ట్ అప్పీరియన్స్ మాదిరిగా ఉంటుందని చెప్పడం ఎందుకు? అనుకున్నాను. 'గోవిందా గోవింద' సినిమా చేయడమే కరెక్ట్ అని నేను భావించాను. అందువలన ఈ కథనే నాకు నచ్చింది అని వర్మతో చెప్పేశాను. అందువలన 'రంగీలా' హిందీకి వెళ్లింది. మా బ్యానర్లో చేసిన గొప్ప డైరెక్టర్లలో వర్మ ఒకరనే చెప్పాలి.

మా బ్యానర్లో వచ్చిన మిగతా సినిమాలన్నీ ఎంత సంతృప్తిని ఇచ్చాయో .. 'మహానటి' ఒక్కటే అంతటి సంతృప్తిని ఇచ్చింది. 'గోరింటాకు' సినిమా సమయంలో నేను సావిత్రిగారిని చూశాను .. దాసరిగారు ఆమెను పరిచయం చేశారు.

ఆమె ఎంత గొప్ప ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. 'మహానటి' సినిమా కోసం ముందుగా ఒక మలయాళ హీరోయిన్ ను అడిగితే, మద్యం సేవించే సీన్స్ చేయనని ఎవరితోనో అన్నట్టుగా తెలిసింది. ఆ అమ్మాయిని మాత్రం పెట్టొద్దని నేను నాగీతో చెప్పాను. అలా ఆ పాత్ర కీర్తి సురేశ్ కి వెళ్లింది. ఆ సినిమా ఆమెకి ఎంత పేరుతెచ్చిందో మీకు తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.