Begin typing your search above and press return to search.

కలల రారాణి ఆశాపరేఖ్.. అవివాహితగా ఉండిపోయిందెందుకు?

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:57 AM GMT
కలల రారాణి ఆశాపరేఖ్.. అవివాహితగా ఉండిపోయిందెందుకు?
X
కాస్త అటు ఇటుగా ఆమెకు 81 ఏళ్లు. ఇప్పటికి ఆమెను చూసినోళ్లంతా అరవైకు కాస్త దగ్గర్లో ఉన్నట్లుగా భావిస్తారు. ఇంత పెద్ద వయసులో పెద్దరికం తీసుకొచ్చిన అందంతో మెరిసే ఆమెకు అంత వయసు ఉందన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1960-70లలో ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. ఇక.. ఆమెను వెండితెర మీద చూసిన కోట్లాది మంది కుర్రకారుకు ఆమె ఒక దేవత. ఆమె సినిమా ఒప్పుకున్న తర్వాతే హీరో ఎవరో డిసైడ్ అయ్యేది. ఆమె తమ సినిమాలో నటించటానికి ఒప్పుకుంటే.. సినిమా సూపర్ హిట్ అయినట్లేనని ఖాయంగా అనుకునేవారు.

భారతీయ సినిమా బాక్సాఫీస్ కాసులు కురిపించే వరలక్ష్మిగా ఆమెకున్న పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. ఇంతకూ ఆమె పేరంటారా? ఆశాపరేఖ్. గుజరాత్ కు చెందిన ఆమెకు ఇప్పటికే బోలెడన్ని అవార్డులు.. పురస్కారాలు ఎప్పుడో పలుకరించాయి. తాజాగా ఆమెకు నటజీవితానికి.. సినిమాకు చేసిన సేవకు నిదర్శనంగా కేంద్రం తాజాగా ఆమెకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో.. ఆమె గతమెంత ఘనమన్న విషయం తెలుసుకునే ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజా పురస్కార ప్రకటనతో నాటి కుర్రాకారు.. నేటి పెద్ద వయస్కుల మదిలో మళ్లీ ఆమె మళ్లీ మెదులుతున్నారు.

1942 అక్టోబరు 2న జన్మించిన ఆశాపరేఖ్ తండ్రి గుజరాతీ జైన్ వ్యాపారీ కాగా.. ఆమె తల్లి సల్మా ముస్లిం. అయితే.. తర్వాతి రోజుల్లో ఆమె హిందువుగా మారారు. ఆశా తల్లికి తన కుమార్తెను చిన్నతనం నుంచి సినిమాల్లో నటించేలా చేయాలని.. ఆమె ఆ రంగంలో రాణించాలని కోరుకునేవారు. చిన్నతనంలోనే క్లాసికల్ డ్యాన్స్ ను నేర్పించారు. ప్రఖ్యాత నాట్య గురువు బన్సీలాల్ భారతీ వద్ద శిక్షణ ఇప్పించారు.

పదహారేళ్ల ప్రాయంలో ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి.. ఆమెను ఒక సినిమాకు ఓకే చేసినప్పటికీ.. చివరి నిమిషంలో ఆమెను తొలగించారు దర్శకుడు విజయ్ భట్. ఆమె అందంగా లేదని.. నటి లక్షణాలు ఏమీ లేవన్నఆయన రిజెక్టు చేసిన ఎనిమిది రోజులకు అప్పటి ప్రముఖ దర్శకుడు నాసిర్ హుస్సేన్ ఆమెనుకు ‘దిల్ దేకే దేఖోతో’ మూవీలో అప్పటి అగ్ర నటుడు షమ్మీ కపూర్ తో జత కట్టే ఛాన్సు ఇచ్చారు.

ఆమె మొదటి సినిమానే పెద్ద హిట్. అలా మొదలైన ఆమె జర్నీ ఆగలేదు. ఎన్నోక్లాసిక్ చిత్రాలతో పాటు.. సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. లవ్ ఇన్ టోక్యో లాంటి సినిమాల్లో ఆమె అందం.. అప్పటి కుర్రకారును నిద్ర లేకుండా చేసేది. అప్పట్లో ఆమె అగ్రహీరోలకు మించి రెమ్యునరేషన్ తీసుకునేవారు. హిందీతో పాటు.. గుజరాతీ.. పంజాబీ.. కన్నడ చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా ‘ఆంఖోం పర్’ మూవీలో తళుక్కుమన్నారు. వయసు మీద పడిన తర్వాత తల్లి.. వదిన పాత్రలు వేసినా.. వాటిని కొనసాగించే ఇష్టం లేక 1999 నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.

47 ఏళ్ల కెరీర్ లో ఆమె 40 కు పైనే అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. కోట్లాది మంది కుర్రాకారుకు ఆరాధ్య దేవతగా.. అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆమె..తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అవివాహితగానే ఉండిపోయారు. ఆమె నాటి అగ్ర దర్శకుడు.. తనకు తొలి సినిమాకు అవకాశం ఇచ్చిన నాసిర్ హుస్సేన్ తో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగారు. కానీ.. అప్పటికే ఆయనకు పెళ్లి కావటంతో ఆమె పెళ్లి ఆశ తీరలేదు.

తర్వాతి కాలంలో అమెరికాకు చెందిన ఒక ప్రొఫెసర్ తో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. అయితే అప్పటికే అతను మరో అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో ఉండటం.. పెళ్లి తర్వాత కూడా అది కొనసాగుతుందని చెప్పటంతో ఆమె నో చెప్పేశారు. పెళ్లి చేసుకోవాలని.. తనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని.. చాలామంది పిల్లల్ని కనాలని కలలు కన్న ఆమె.. చివరకు అవివాహితగానే ఉండిపోయారు. పెళ్లి మీద ఎన్నో ఆశలు ఉన్న ఆమె.. చివరకు పెళ్లి చేసుకోకూడదన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమెను పెళ్లాడటానికి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆసక్తి చూపినా.. ఆమె మాత్రం నో చెప్పేశారు. అయితే.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం అత్యుత్తమమైనదని చెప్పటం గమనార్హం. ఎంతో మందికి తన అందంతో నిద్ర లేకుండా చేసి.. కలల రారాణిగా నిలిచిన ఆమె.. జీవితంలో మాత్రం ఒంటరిగా ఉండటం మాత్రం విచిత్రంగా చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.