శిల్ప చెప్పినట్లు రాజ్ మంచిబాలుడేం కాదట.. చెప్పిందెవరంటే?

Mon Jul 26 2021 09:00:46 GMT+0530 (IST)

As Shilpa said, Raj is Not a good boy.

బూతు సినిమాలు తీస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటో ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు మరిన్ని చిక్కులు ఎదురయ్యే కీలక పరిణామం తాజాగా ఎదురైంది. ఆరు గంటల పాటు విచారించిన అనంతరం కూడా తన భర్త బుద్ధిమంతుడని.. అతడికి ఏ పాపం తెలీదని.. అతను తీసింది బూతు సినిమాలు కావని.. రొమాంటిక్ మూవీలని చెప్పిన శిల్ప మాటల్లో ఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని స్పష్టమయ్యే ఆధారాలు పోలీసులకు లభించినట్లు చెబుతున్నారు. పోర్నోగ్రఫీకి.. శృంగారభరిత చిత్రాలకు తేడా ఉందని.. తన భర్త రెండో తరహా సినిమాలు తీస్తాడని చాలా అమాయకంగా చెప్పిన శిల్పాశెట్టి మాటల్లో ఏ మాత్రంనిజం లేదని తేలినట్లుగా తెలుస్తోంది.దీనికి కారణం.. రాజ్ కుంద్రా వద్ద పని చేసే ఉద్యోగులే అతడి లీలల గురించి కీలక సమాచారాన్ని వెల్లడించినట్లుగా సమాచారం. పోలీసుల విచారణలో భాగంగా రాజ్ వద్ద పని చేసే వియాన్ సంస్థకు చెందిన ఉద్యోగుల్ని పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా  వారు రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి ముందుకు రావటంతో అతడి మెడకు కేసు ఉచ్చు మరింతగా బిగుసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బూతు సినిమాల్ని తీసే రాజ్ కుంద్రా గురించి మొత్తం సమాచారం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో సమాచారాన్ని పోలీసుల దగ్గర వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు బూతు సినిమాల నిర్మాణానికి సంబంధించిన కేసును మాత్రమే బుక్ చేసిన అధికారులు రానున్న రోజుల్లో మనీ ల్యాండరింగ్.. ఫెమా (ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) చట్టం కింద కేసులు నమోదు చేసే వీలుందన్న మాట పోలీసుల వర్గాల నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ముంబయి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 27 వరకు పోలీసుల కస్టడీలో రాజ్ కుంద్రా ఉండనున్నారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఆయన పోలీసులకు సరైన రీతిలో సమాచారం అందించటం లేదని.. విచారణకు సహకరించటం లేదని తెలుస్తోంది. దీంతో.. మరిన్ని రోజులు విచారణకు కోరే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించిన టీవీ నటి.. మోడల్ గెహానా వశిష్ట్ తో పాటు మరో ఇద్దరు కూడా ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉన్నా.. వారు రాలేదు. ఈ రోజు వచ్చే వీలుందంటున్నారు. మొత్తంగా రాజ్ కుంద్రా మెడకు బూతు సినిమాల ఉచ్చు అంతకంతకూ బిగుసుకుంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.