'నాయట్టు' రీమేకునే వేరే టీమ్ తో తీస్తున్నారా..?

Fri Jul 01 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Are you doing the remake of 'Nayattu' with a different team?

పాండమిక్ టైంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలలో "నాయట్టు" ఒకటి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబడిన ఈ మలయాళ సినిమాను తెలుగు సినీ అభిమానులు కూడా విపరీతంగా చూశారు. నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారు.. అధికారాన్ని చేతిలో పెట్టుకుని సామాన్యులను ఎలాంటి వేధింపులకు గురి చేస్తారు అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి సొంత పోలీసులను ఎలా బలిపశువులను చేశారనే అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించారు. వాస్తవికతకు దగ్గరగా రూపొందిన ఈ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో అధికారికంగా రీమేక్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు.

'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో అంజలి - ప్రియదర్శి - రావు రమేష్ ప్రధాన పాత్రల్లో గతేడాది 'నాయట్టు' తెలుగు రీమేక్ ను ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - విద్యా మాధురి ఈ రీమేక్ సినిమాని నిర్మిస్తారని తెలిపారు. మ్యూజిక్ మణిశర్మ - ఎడిటర్ నవీన్ నూలి - సినిమాటోగ్రాఫర్ అరుళ్ విన్సెన్ట్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతారని చెప్పారు.

అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమా ఆగిపోయిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు అదే చిత్రాన్ని మొత్తం టీమ్ ని చేంజ్ చేసి మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 'జోహార్' ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ ను గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో శ్రీకాంత్ - రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - విద్యా మాధురి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా అని తెలిపారు. అయితే ఈ మూవీ 'నాయట్టు' తెలుగు రీమేక్ తప్ప మరొకటి కాదని టాక్ వినిపిస్తోంది.

ఇదే నిజమైతే అప్పట్లో లాంచ్ చేసిన 'నాయట్టు' రీమేక్ ను ఎందుకు పక్కన పెట్టేసారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరుణ కుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ను ఎందుకు తొలగించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.