పవన్ హరి హర పై అవన్నీ పుకార్లేనా?

Sat May 28 2022 23:00:01 GMT+0530 (IST)

Are not they all rumors about Pawan Hara Hari veera mallu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల విరామం తరువాత `వకీల్ సాబ్`తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించి పవన్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ గా నిలిచింది. ఈ మూవీ తరువాత పవన్ చేసిన మరో రీమేక్ `భీమ్లానాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రీమేక్ అయిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అనిపించుకోకపోయినా ఫరవాలేదనే టాక్ ని సొంతం చేసుకుంది.ఇలా బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లతో వరుస హిట్ లని సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్ అదే జోష్ తో మరిన్ని ప్రాజెక్ట్ లని పట్టాలెక్కించారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. పవన్ కల్యాన్ నటిస్తున్న తొలి జానపద పీరియాడికల్ మూవీ ఇది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మరో నిర్మాత ఏ. దయాకర్ రావుతో కలిసి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు షూట్ చేసిన రషెస్ చూసుకున్న పవన్ కల్యాణ్ ఔట్ పుట్ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని దీంతో తదుపరి షెడ్యూల్స్ ని అర్థాంతరంగా రద్దు చేశారని త్వరలోనే రీ షూట్ కు వెళ్లబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ సినిమాపై ఇప్పటి వరకు వినిపించిన వార్తలన్నీ పుకార్లే నని చెబుతున్నారు. సినిమా ఆగిపోలేదని ఎలాంటి రీ షూట్ లకు వెళ్లడం లేదని తాజా షెడ్యూల్ ని జూన్ 7 నుంచి ప్రారంభించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ ఇరవై రోజుల పాటు సాగనుందని ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా పలు కీలక ఘట్టాలని చిత్రీకరించబోతున్నారని తెలిసింది. తాజా అప్ డేట్ తో పుకార్లకు చిత్ర బృందం చెక్ పెట్టిందని ఇన్ సైడ్ టాక్.

ఇదిలా వుంటే ఈ మూవీలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలకమైన రోషనార పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతే కనిపించబోతోంది. అంతే కాకుండా ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్ పూజిత పొన్నాడ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ వీఎస్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం క్రిష్ జాగర్లమూడి మాటలు సాయి మాధవ్ బుర్రా.