Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ నిర్మాతలు ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఉన్నారా?

By:  Tupaki Desk   |   5 April 2020 12:30 AM GMT
టాలీవుడ్‌ నిర్మాతలు ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఉన్నారా?
X
కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వారికి సాయం చేసేందుకు నిర్మాతల మండలి సిద్దంగా ఉంది అంటూ కొన్ని రోజుల క్రితం సి కళ్యాణ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిర్మాతల మండలి సభ్యులు ఎవరైనా వస్తే లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని.. వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సి కళ్యాణ్‌ ప్రకటించాడు.

ఆ తర్వాత ఆ మొత్తంను 10 వేలకు తగ్గించినట్లుగా తెలుస్తోంది. నిర్మాతల మండలికి చెందిన మూల ధనం నుండి ఆ మొత్తంను ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మొత్తంను తిరిగి ఇవ్వకుంటే మూడు నెలల్లో మండలి నుండి వారిని తొలగించడం జరుగుతుందని.. తద్వారా వారు నిర్మాతల మండలికి చెందిన ఎలాంటి కార్యక్రమాల్లో కాని ఇతరత్ర పథకాల్లో కాని భాగస్వామి కారని ప్రకటించారు. పది వేల రూపాయల కోసం ఎవరు వస్తారులే అనుకున్నారట. కాని నిర్మాతల మండలి వారు షాక్‌ అయ్యేలా అప్లికేషన్స్‌ వస్తున్నాయట.

ఇప్పటి వరకు నిర్మాతల మండలి వద్ద తమకు 10 వేల రూపాయలు కావాలంటూ 90 మంది వరకు అప్లికేషన్‌ పెట్టుకున్నారట. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. 10 వేల కోసం దరకాస్తు పెట్టుకున్న వారిలో గతంలో మంచి సినిమాలు.. స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు కూడా ఉన్నారు. అప్పట్లో ఆర్థికంగా బాగానే ఉన్న నిర్మాతలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేందుకు ఇదే నిదర్శణం. నిర్మాతలు అంటే కోట్లు సంపాదించి ఉంటారని అంతా అనుకుంటారు. కాని టాలీవుడ్‌ లో మరీ ఇంత దారుణమైన పరిస్థితి లో నిర్మాతలు ఉన్నారా అంటూ అంతా నోరు వెళ్లబెడుతున్నారు.