Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా సత్తా ఉన్న సినిమాలు ఇవేనా??

By:  Tupaki Desk   |   5 April 2020 4:30 AM GMT
పాన్ ఇండియా సత్తా ఉన్న సినిమాలు ఇవేనా??
X
బాహుబలి ఫ్రాంచైజీ ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియా సినిమాలకు భారీగా పెరిగింది. ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించేందుకు ఫిలిం మేకర్లు రెడీ అయ్యారు. ఆ కోవలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కూడా. అవి కాకుండా కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.. కొన్ని ప్లానింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడడం సినిమాలకు కాస్త ఇబ్బందికరమైన పరిణామం అనే చెప్పాలి. మరి ఈ పరిస్థితులలో పాన్ ఇండియా లక్ష్యంగా రూపొందుతున్న సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందా.. ఇలాంటివి ఎన్ని సినిమాలు ఉన్నాయి?

ఇలాంటి సినిమాల లిస్టు కనుక మనం ఒకసారి గమనిస్తే ఏ సినిమాలకు నిజంగా పాన్ ఇండియా అప్పీల్ ఉంది.. ఏ సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ లేదు అనే విషయం మనకు అర్థం అవుతుంది. ఒక్కసారి మనం అలాంటి సినిమాల లిస్టు పై లుక్కేద్దాం.

RRR: ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉందా లేదా అనేది మాత్రం చర్చనీయాంశం. ఎందుకంటే ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోలు అటు చరణ్.. ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా సౌత్ కు మాత్రమే తెలిసిన వారు. నార్త్ లో వీరి సినిమాలు యూట్యూబ్ లో చూసి ఉండొచ్చు కానీ థియేటర్లకు వచ్చి ఎంత మాత్రం చూస్తారు అనేది ఆలోచించాల్సిన విషయం. సౌత్ వరకు మాత్రం హీరోలు దుమ్ము లేపడం ఖాయం. అదే నార్త్ ఇండియా విషయానికి వస్తే మాత్రం పెద్దగా ప్రభావం లేకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్- క్రిష్ మూవీ: పవన్ కళ్యాణ్ తెలుగులో చాలా పెద్ద స్టార్ హీరో. ఆయన క్రేజ్ కు ఆకాశమే హద్దు. ఇక తెలుగు రాష్ట్రాల బయటకు వెళ్తే కర్ణాటక లో మాత్రం పవన్ కు క్రేజ్ వుంది. ఇక మిగతా చోట్ల పవన్ సినిమాను పెద్దగా పట్టించుకోరు అన్నది చేదు వాస్తవం. అయితే ఇప్పటికే క్రిష్ కు బాలీవుడ్ సినిమాలకు పని చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ సినిమాను వారికి తగ్గట్టుగా మలుస్తాడేమో వేచి చూడాలి.

జాన్: బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకుతూ ఉంది. సాహో రిలీజ్ కు ముందు చాలామంది ప్రభాస్ ను నార్త్ లో పెద్దగా పట్టించుకోరు అని అంచనాలు వేశారు కానీ నార్త్ లో చాలా పెద్ద హిట్ అయి కూర్చుంది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు అన్న సంగతి తేలినట్టే. ఈ సినిమాకు కూడా సౌత్.. నార్త్ అన్న తేడా లేకుండా భారీ క్రేజ్ నెలకొనడం ఖాయం.

అల్లు అర్జున్- సుకుమార్ మూవీ: అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక మిగతా మెగా హీరోల తరహాలోనే కర్ణాటకలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో సౌత్ వరకు స్టైలిష్ స్టార్ కవర్ చేయడం సులువే. నార్త్ మార్కెట్ లో పాగా వేయడం మాత్రం అల్లు అర్జున్ కు ప్రస్తుతానికి కష్టమే.

కే జి ఎఫ్ 2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన 'కే జి ఎఫ్' దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో రెండవ భాగానికి భారీ క్రేజ్ నెలకొంది. ఈ రెండవ భాగంలో బాలీవుడ్ నటులను కూడా తీసుకోవడం తో క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ సినిమా మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి.

భారతీయుడు-2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు-2 ప్రస్తుతం సెట్స్ పై ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. శంకర్ గత చిత్రం 2.0 సౌత్ భాషలలో పరాజయం పాలైనప్పటికీ హిందీ లో మాత్రం ఘన విజయం సాధించింది. దీంతో శంకర్ తదుపరి చిత్రమైన 'ఇండియన్-2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ లాంటి పాన్ ఇండియన్ హీరో ఉండడం తో ఈ సినిమాకు ఆటోమేటిక్ గా పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది.