Begin typing your search above and press return to search.

పబ్లిసిటీ ఖర్చులైనా వస్తాయా?

By:  Tupaki Desk   |   4 Dec 2019 3:53 PM GMT
పబ్లిసిటీ ఖర్చులైనా వస్తాయా?
X
అమెరికాలో మన తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే చాలు.. ఎవరైనా సులువుగా జవాబు చెప్పేస్తారు. పెద్ద హీరోల సినిమాలకు లాభాలు రావడం లేదు. మీడియం రేంజ్ హీరోల సినిమాలు.. చిన్న సినిమాలను అక్కడ ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం లేదు. సినిమాకు మంచి టాక్ వస్తే ఏ అమెజాన్ లోనో.. నెట్ ఫ్లిక్స్ లోనో.. ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లోనో సినిమా చూడాలని డిసైడ్ చేసుకుంటున్నారు. కొందరైతే టొరెంట్ లకు జై కొడుతున్నారు.

అందుకే అమెరికాలో తెలుగుసినిమాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఏడాది మొత్తం మీద అమెరికాలో లాభాలు తీసుకొచ్చిన సినిమాలు కనీసం ఐదు కూడా లేవంటేనే మనం తెలుగు సినిమాల మార్కెట్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మార్కెట్లో మాత్రమే 'మథనం' సినిమాను రిలీజ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అసలు విడుదల చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పెద్ద సినిమాలకే టికెట్లు కొనేందుకు పదిసార్లు ఆలోచిస్తున్న అమెరికా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి నూతన నటీనటులు ఉన్న సినిమాకు టికెట్లు కొంటారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే కనీసం ఫ్రీ షోలు వేస్తే కొందరైనా ప్రేక్షకులు వస్తారు. అక్కడ ఫ్రీగా షోలు వేసిన ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అందరూ డాలర్లవేటలో నిమగ్నమైన జ్ఞానులు. తుచ్ఛమైన విషయాలకు సమయం వృధా చేసుకోరు. మరి ఈ సినిమాకు ఫ్రీ షోలు వేసినా ఆ ప్రేక్షకులు వస్తారా అనేది ఆలోచించాల్సిన విషయమే.

అమెరికాలో సినిమా హిట్ అయితే తెలుగులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఉంది. ఏడాది మొత్తం మీద కనీసం మూడు నాలుగు హిట్లు లేని చోట ఈ సినిమా హిట్ అయ్యి.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కావడం అనేది జరిగే పనేనా అని ఇండస్ట్రీలో సెటైర్లు వేస్తున్నారు. అసలు ఈ సినిమాకు పబ్లిసిటీ ఖర్చులైనా వస్తాయా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దాం.