Begin typing your search above and press return to search.

అందుకే ఆ సినిమాలు వదిలేసిన అనుపమ!

By:  Tupaki Desk   |   18 Feb 2022 11:30 PM GMT
అందుకే ఆ సినిమాలు వదిలేసిన అనుపమ!
X
అనుపమ పరమేశ్వరన్ పేరు వినగానే ముత్యపు చిప్పలా విచ్చుకున్న ఆమె కళ్లు గుర్తొస్తాయి. తుమ్మెదల గుంపులాంటి కనురెప్పలు గుర్తొస్తాయి. ఆ కళ్లలోని ఆకర్షణ మత్తుమందును వెదజల్లుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ కనురెప్పల కోలాటంలో చేరిపోవాలనిపిస్తుంది. అంతగా ఆమె తన చూపులతోనే పడుచు ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. కుర్రహీరోల సరసన కుదురుకునే రూపం కావడంతో చకచకా అవకాశాలు వచ్చిపడ్డాయి. దాంతో ఆరంభంలో ఆమె కెరియర్ జోరుమీదనే కొనసాగింది.

కెరియర్ ను మొదలెట్టేసిన చాలాకాలానికిగానీ హిట్ పడని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ హిట్ తోనే తన కెరియర్ ను మొదలుపెట్టిన కథానాయికగా అనుపమ కనిపిస్తుంది. ఒకటి కాదు .. రెండు కాదు .. ఏకంగా ఆమె మూడు హిట్లు కొట్టేసింది. 'అ ఆ' .. 'ప్రేమమ్' .. 'శతమానం భవతి' వంటి సినిమాలు ఆ జాబితాలో మనకి కనిపిస్తాయి. 'శతమానం భవతి' చూస్తే ఈ అమ్మాయి పుట్టింది కేరళలో కాదు .. కోనసీమలోనేమో అనిపిస్తుంది .. అంతగా ఆ పాత్రలో జీవించింది. ఆ తరువాత నానీతో చేసిన 'కృష్ణార్జున యుద్ధం' కూడా ఆమెకి భారీ సక్సెస్ నే ముట్టజెప్పింది.

2015లోనే తన కెరియర్ ను మొదలెట్టిన అనుపమ తెలుగుతో పాటు మలయాళంలోను తన కెరియర్ ను నడిపిస్తూ వచ్చింది. తెలుగులో ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువగా అనిపించడానికి కారణం కొన్ని అవకాశాలను వదులకోవడమే. ఆమె వదులుకోగా భారీ విజయాలను అందుకున్న సినిమాలుగా 'నేను లోకల్' .. 'మహానుభావుడు' .. 'రంగస్థలం' కనిపిస్తాయి. పారితోషికం కారణంగానే ఆమె ఆ సినిమాలు వదులుకుందనే టాక్ వచ్చింది. కానీ నానీ .. శర్వానంద్ .. చరణ్ జోడీగా పెద్ద బ్యానర్లలో ఛాన్స్ రావడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి అవకాశాలను ఎవరూ పారితోషికం కోసం వదులుకోరు. కనుక అందులో నిజం ఉండకపోవచ్చు.

ఇక నితిన్ తో 'అ ఆ' వంటి హిట్ అందుకున్న అనుపమ, 'ఛల్ మోహన్ రంగా' చేయడానికి మాత్రం నో చెప్పేసింది. కథానాయిక పాత్రను డిజైన్ చేసిన తీరు నచ్చకపోవడం వల్లనే ఆమె అలా చెప్పిందని అంటారు. ఇక 'అరవింద సమేత'లో ఈషా రెబ్బా చేసిన పాత్రకి గాను ముందుగా అనుపమనే సంప్రదించారు. అయితే షోకేస్ లో బొమ్మలాంటి ఆ పాత్రను ఆమె చేయనని చెప్పడం వల్లనే ఆ పాత్ర ఈషా రెబ్బాకి వెళ్లిందని అంటారు. ఇక 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నభా నటేశ్ పాత్ర కోసం కూడా ముందుగా అనుపమనే అడిగారట. ఆ స్థాయి ఎక్స్ పోజింగ్ నా వల్ల కాదంటూ ఈ బ్యూటీ తిరస్కరించిందని చెబుతారు.

ఇక నిఖిల్ జోడీగా 'అర్జున్ సురవరం' సినిమాలో లావణ్య త్రిపాఠి చేసిన పాత్రను అనుపమనే చేయవలసిందట. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వలన ఆమె ఆ సినిమా చేయలేకపోయిందని అంటారు. ఇప్పుడు ఆమె నుంచి రానున్న రెండు సినిమాలు కూడా నిఖిల్ తో చేసినవి కావడం విశేషం. ఒకటి '18 పేజెస్' అయితే మరొకటి 'కార్తికేయ 2'. ఈ రెండు సినిమాలు కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వేరే భాషల్లో బిజీగా ఉండటం వలన కొన్ని అవకాశాలను వదులుకోవడం .. అలా వదులుకున్న సినిమాలు సక్సెస్ కావడం అందరి విషయంలోను జరుగుతూనే ఉంటుంది.

ఇక అనుపమ వదిలేసిన సినిమాలను .. పాత్రలను చూస్తే మాత్రం, ఆమె తన కెరియర్లో పూర్తి క్లారిటీతో ఉందనే విషయం అర్థమవుతుంది. స్టార్ హీరోలు .. పెద్ద బ్యానర్లు అయినప్పటికీ, ప్రాధాన్యత లేని పాత్రలను చేయనని చెప్పేసింది. అలాగే గ్లామర్ పరంగా హద్దులు దాటడం తన వలన కాదని స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన 'రౌడీ బాయ్స్' విషయంలోనూ ఆమె అంచనా తప్పలేదు. ఆ సినిమా చేయడానికి ముందుగా ఆమె ఒప్పుకోలేదనీ, తాము ఒత్తిడి చేయడం వల్లనే ఓకే చెప్పిందని దిల్ రాజు స్టేజ్ పైనే చెప్పారు. చివరికి ఆమె అనుకున్నట్టుగానే జరిగింది. హద్దులు దాటని గ్లామర్ తో అవధులు లేని అభినయాన్ని నమ్ముకున్న ఈ కేరళ బ్యూటీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!