Begin typing your search above and press return to search.

'అంత ఇష్టం' ప్రోమో: భీమ్లా నాయక్ లోని మరో కోణాన్ని తెలియజేసే గీతం..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 6:23 AM GMT
అంత ఇష్టం ప్రోమో: భీమ్లా నాయక్ లోని మరో కోణాన్ని తెలియజేసే గీతం..!
X
పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ఇద్దరు హీరోల గ్లిమ్స్ - ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 'అంత ఇష్టం' అనే మరో పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని సోషల్ మీడియాలో విడుదల చేశారు.

'అంత ఇష్టం ఏందయా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు నా మీద.. అంత ఇష్టం ఏందయ్యా నీకు' అంటూ పవన్ - నిత్యా మీనన్ ల మీద సాగిన ఈ గీతం అలరిస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన భీమ్లా నాయక్ లోని ప్రేమ కోణాన్ని ఈ పాట ఆవిష్కరిస్తోంది. ఎస్ఎస్ థమన్ ఈ సాంగ్ కు ట్యూన్ సమకూర్చగా.. ప్రముఖ గాయని కేఎస్ చిత్ర ఆలపించారు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు.

దసరా పండగ వేళ రేపు (అక్టోబర్ 15) ఉదయం 10.19 గంటలకు 'అంత ఇష్టం' పూర్తి లిరికల్ వీడియోని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా, 'భీమ్లా నాయక్' చిత్రం మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్. నిజానికి ఒరిజినల్ వెర్సన్ లో హీరోహీరోయిన్ల మధ్య పాటలు ఉండవు. కానీ తెలుగులో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇందులో భాగంగానే పవన్ కు ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసి నిత్యా తో సాంగ్ కూడా పెట్టారు.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రవి కె చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.